telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : హ్యాట్రిక్ కొట్టిన .. బెంగుళూరు ..

bangalore won on punjab in ipl 2019 matchs

ఆరు ఓటములతో గెలుపు దాహమేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించింది. ఏబీ డివిలియర్స్‌ (82 నాటౌట్‌; 44 బంతుల్లో 3×4, 7×6) చెలరేగిన వేళ.. 17 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై విజయం సాధించింది. డివిలియర్స్‌తో పాటు పార్థివ్‌ పటేల్‌ (43; 24 బంతుల్లో 7×4, 2×6), స్టాయినిస్‌ (46 నాటౌట్‌; 34 బంతుల్లో 2×4, 3×6) మెరవడంతో మొదట బెంగళూరు 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్‌ 7 వికెట్లకు 185 పరుగులు చేయగలిగింది. కేఎల్‌ రాహుల్‌ (42; 27 బంతుల్లో 7×4, 1×6), మయాంక్‌ అగర్వాల్‌ (35; 21 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు.. పూరన్‌ (46; 28 బంతుల్లో 1×4, 5×6) పోరాటం సరిపోలేదు.

పంజాబ్‌కు భారీ లక్ష్యఛేదనలో అదిరే ఆరంభం లభించింది. గేల్‌, కేఎల్‌ రాహుల్‌ బౌండరీల మోత మోగించడంతో ఆ జట్టు మూడు ఓవర్లకే 36 పరుగులు చేసింది. ఊపు మీదున్న దశలో ఉమేశ్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ కొట్టబోయి లాంగాన్‌లో గేల్‌ (23; 10 బంతుల్లో 4×4, 1×6) క్యాచ్‌ ఔటయ్యాడు. అయితే రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ దూకుడు కొనసాగించడంతో పంజాబ్‌ 9వ ఓవర్లలోనే 100 దాటింది. కానీ లక్ష్యం పెద్దదే అయినా.. ఛేదన సాఫీగా సాగుతున్న దశలో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ పెద్ద కుదుపునకు లోనైంది. జోరుమీదున్న మయాంక్‌, రాహుల్‌ నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించారు. వీళ్లిద్దరిని స్టాయినిస్‌, మొయిన్‌ అలీ వరుస ఓవర్లలో వెనక్కి పంపారు. అంతే.. ఆ తర్వాత పరుగుల వేగం బాగా తగ్గిపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. మిల్లర్‌ (24; 25 బంతుల్లో 2×4) ధాటిగా ఆడలేపోయాడు. 13 ఓవర్లకు స్కోరు 116/3. కానీ వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో పూరన్‌ మూడు సిక్సర్లు బాది పంజాబ్‌ను రేసులో నిలిపాడు. సైని బౌలింగ్‌లో ఓ ఫోర్‌ బాదిన అతడు.. అలీ ఓవర్లో రెండు సిక్స్‌లు దంచాడు. చివరి నాలుగు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో సౌథీ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను మిల్లర్‌ బౌండరీ దాటించాడు. కానీ తర్వాతి 4 బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. 18వ ఓవర్లో ఉమేశ్‌ ఆరు పరుగులే ఇచ్చాడు. అయినా పంజాబ్‌ రేసులోనే ఉంది. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు అవసరమయ్యాయి. కానీ సైని 19 ఓవర్‌ తొలి బంతికి మిల్లర్‌ను, ఆఖరి బంతికి ప్రమాదకర పూరన్‌ను ఔట్‌ చేసి పంజాబ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత బెంగళూరు గెలుపు లాంఛనమే.

బెంగళూరు ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ మెరుపులతో ఘనంగా ఆరంభించిన ఆ జట్టు.. చకచకా వికెట్లు కోల్పోయి పరుగుల్లో వెనుకబడింది. ఆఖర్లో డివిలియర్స్‌ వీర విధ్వంసంతో ఊహించని స్కోరును అందుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు త్వరగానే కోహ్లి (13; 8 బంతుల్లో 2×4) వికెట్‌ను కోల్పోయినా.. పార్థివ్‌ పటేల్‌ విరుచుకుపడడంతో ధారాళంగా పరుగులు సాధించింది. పార్థివ్‌ ఎడాపెడా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 70/1తో నిలిచింది. కానీ పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో 10 పరుగుల వ్యవధిలో పార్థివ్‌, మొయిన్‌ అలీ (4), అక్ష్దీప్‌ (3) వికెట్లు చేజార్చుకుని 9 ఓవర్లలో 81/4కు పడిపోయింది. అశ్విన్‌, మురుగన్‌ అశ్విన్‌, విల్జోయెన్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగం కూడా తగ్గిపోయింది. 13 ఓవర్లకు స్కోరు 99 పరుగులే. అప్పటికి డివిలియర్స్‌ 23 బంతుల్లో 23, స్టాయినిస్‌ 13 బంతుల్లో 7 పరుగులే చేశారు. ఆ దశలో బెంగళూరు 200 అందుకోగలదని ఎవరూ అనుకోలేదు. కానీ డివిలియర్స్‌ జోరందుకున్నాడు. 15వ ఓవర్లో రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6 సిక్స్‌ బాదిన అతడు.. మురుగన్‌ అశ్విన్‌ ఓవర్లో మరో సిక్స్‌ దంచాడు. ఆఖరి మూడు ఓవర్లలో డివిలియర్స్‌ విధ్వంసం పరాకాష్టకు చేరింది. అతడు తనదైన శైలిలో భారీ షాట్లతో సిక్స్‌ల మోత మోగిస్తూ .. ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అతడితో పాటు స్టాయినిస్‌ రెచ్చిపోవడంతో చివరి మూడు ఓవర్లలో బెంగళూరు ఏకంగా 64 పరుగులు రాబట్టింది. విల్జోయెన్‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా 4, 6 బాదిన డివిలియర్స్‌.. వెంటనే షమి బౌలింగ్‌లో వరుసగా మూడు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టాడు. ఇందులో ఒకటి స్టేడియం బయటపడింది. ఆఖరి ఓవర్లో విల్జోయెన్‌ ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. డివిలియర్స్‌ తొలి బంతికి సిక్స్‌ కొట్టి, రెండో బంతికి సింగిల్‌ తీయగా.. ఆ తర్వాత స్టాయినిస్‌ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు. పంజాబ్‌ బౌలర్లలో అశ్విన్‌ (1/15) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

bangalore won on punjab in ipl 2019 matchsనేటి మ్యాచ్ : కలకత్తా vs రాజస్థాన్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Related posts