telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేపటితో ముగియనున్న .. అయోధ్య కేసు వాదనలు..

ayodya case hearing will end tomorrow

రేపటితో అయోధ్య వివాదంలో వాదనలు ముగియనున్నాయి. ఈ కేసుపై రోజువారీ విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన సంకేతాల ప్రకారం ఈ నెల 16తో వాదనలు ముగించనున్నట్టు తెలుస్తోంది. మంగళవారం 39వ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వివిధ పార్టీలకు బుధవారం సమయాన్ని కేటాయించారు. హిందూ పార్టీల తరపున వాదనలు వినిపిస్తున్న సీ ఎస్ వైద్యనాథన్‌కు 45 నిమిషాలు, వాదుల జవాబుకు ప్రతివాదుల స్పందన (రిజాయిండర్) చెప్పేందుకు ముస్లిం పార్టీలకు ఒక గంట సమయం కేటాయించారు.

మిగిలిన హిందూ పార్టీలన్నీ తమ వాదనలను పూర్తి చేసేందుకు ఒక్కొక్క పార్టీకి 45 నిమిషాల చొప్పున 4 భాగాలుగా సమయాన్ని కేటాయించారు. దీనినిబట్టి బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ధర్మాసనం విచారణ జరుగుతుంది. మంగళవారం కూడా సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది. బుధవారంతో వాదనలు పూర్తయితే తీర్పును రిజర్వు చేస్తారు. జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబరు 17న పదవీ విరమణ చేస్తారు. ఆలోగానే ఈ కేసులో తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ డీ వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ ఉన్నారు.

Related posts