telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం…

australia won on srilanka 2019 world cup match

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 20వ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా జట్టు 87 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలకడగా ఆడుతూ విజయం సాధిద్దామనే ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కు దిగారు. దీంతో వచ్చీ రాగానే షాట్లకు యత్నించి ఆ జట్టు ఆటగాళ్లు ఔటయ్యారు. ఈ క్రమంలో లంక జట్టులో కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఒక్కడే రాణించాడు. 108 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు చేసిన దిముత్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా (36 బంతుల్లో 52 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీతో రాణించాడు. కాగా లంక జట్టులో మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. దీంతో ఆ జట్టు 45.5 ఓవర్లలోనే 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీయగా, రిచర్డ్సన్ 3, ప్యాట్ కమ్మిన్స్ 2, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ 1 వికెట్ తీశారు. అయితే ఆరంభంలో లంక బ్యాట్స్‌మెన్ ఓ దశలో 115 పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండా ధాటిగా ఆడారు. దీంతో శ్రీలంక గెలుస్తుందని అందరూ భావించారు. కానీ చెత్త షాట్లు ఆడిన ఆ జట్టు బ్సాట్స్‌మెన్ వికెట్లను అనవసరంగా సమర్పించుకున్నారు. దీంతో లంక జట్టుకు ఓటమి తప్పలేదు. ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (132 బంతుల్లో 153 పరుగులు, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. మరోవైపు ఆసీస్ జట్టులో స్టీవెన్ స్మిత్ (59 బంతుల్లో 73 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్) కూడా రాణించాడు. కాగా లంక బౌలర్లలో ఇసురు ఉదానా, ధనంజయ డి సిల్వాలు చెరో 2 వికెట్లను తీయగా, లసిత్ మలింగా 1 వికెట్ తీశాడు.

Related posts