telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

అశోక్‌ లేల్యాండ్‌ .. తయారీ ప్లాంట్‌లలో తగ్గిపోతున్న ఉత్పాదకత..

ashok leyland production in down-line

అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ తన తయారీ ప్లాంట్‌లలో వాహన ఉత్పత్తిని తగ్గించింది. ఈ నెలలో కొన్ని ప్లాంట్లను 5 నుంచి 18 రోజుల పాటు మూసివేసింది. ఈ పరిణామం ఉద్యోగులను కలవరపరుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్క చెన్నై ప్లాంటులోనే దాదాపు మూడు వేల మంది వరకూ ఒప్పంద ఉద్యోగులు ఉండగా వారికి నెలవారీ వేతనాలను సగానికి పైగా తగ్గించి ఇస్తోందని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. రూ.13 వేలు వేతనం ఇవ్వాల్సిన వారికి రూ.4 వేలు జమ చేస్తుండడంతో చిరుద్యోగులు సతమతమవుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో ‘పని లేదు-వేతనమూ లేదు’ (నో వర్క్‌-నో వేజ్‌) విధానం అమలవుతోందని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామన్‌ వెల్లడించారు. మరోవైపు సాధారణ ఉద్యోగులకు సైతం జీతంలో కోత విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గతేడాది ఇదే సమయానికి అశోక్‌ లేల్యాండ్‌ వాహన అమ్మకాలు 50 శాతం పడిపోయాయి. 2018 ఆగస్టులో లారీలు, బస్సుల అమ్మకాలు 16,628 ఉండగా, గత నెలలో 8,296 మాత్రమే నమోదు కావడం సంస్థ ఉద్యోగులను కలవరపరుస్తోంది. బీఎస్‌-6 వాహనాల విషయంలో తొలుత ప్రభుత్వ విధానాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి మళ్లడం, జీఎస్టీ వంటి పరిణామాలు ముఖ్యంగా వాణిజ్య వాహన పరిశ్రమను పీడిస్తున్నాయి. దీనివల్ల అమ్మకాలు 54 శాతం పడిపోయాయి. గత నెలలో 51,897 వాహనాలు అమ్ముడు కాగా, 2018 ఆగస్టులో 84,668 కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం వాహనాలపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని తగ్గించాలని ఈ పరిశ్రమ కోరుకుంటోంది.

Related posts