telugu navyamedia
రాజకీయ వార్తలు

పీఎంవో తీరు అయోమయం కలిగిస్తోంది: ఒవైసీ

asaduddin owisi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా ఎలాంటి దురాక్రమణ జరపలేదని అన్నారు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. మన భూభాగంలో చైనా చొరబడలేదని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతోంది. ఈ క్రమంలో కొంత అయోమయం కలుగుతోందని, అందుకే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

చైనా బలగాలను మన భూభాగం నుంచి తరిమికొట్టే ప్రయత్నంలో కాకపోతే మరి ఎందుకు మనవాళ్లు 20 మంది చనిపోవాల్సి వచ్చింది?అని ప్రశ్నించారు. గాల్వన్ లోయ తమదేనని చైనా చెబుతోంది. గాల్వన్ లోయలో ఎలాంటి ఆక్రమణలు లేవని ప్రధాని మోదీ చెప్పడం చైనా వాదనను బలపర్చడం కాదా అని ప్రశ్నించారు.

గాల్వన్ లోయలో చైనా చొరబాట్లు లేవని, భారత ప్రాదేశిక భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని చెబుతున్నప్పుడు, వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన చీఫ్ దేనికి ప్రకటించినట్టు అని దుయ్యబట్టారు. పార్లమెంటు ఆమోదం లేకుండా భారత భూభాగాన్ని ఇతర దేశాలకు అప్పగించే అధికారం ఏ ప్రధానమంత్రికి కూడా లేదని ఒవైసీ స్పష్టం చేశారు.

Related posts