telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్టికల్ 370 ఎఫెక్ట్… పాక్ లో భారత్ సినిమాల నిషేధం… నష్టం ఎవరికీ ?

Banned

కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపతి కల్పించే 370 అధికరణను భారత్ రద్దు చేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేసినప్పటికీ పాక్ మాత్రం కశ్మీర్‌పై భారత్ వైఖరిని తప్పుబడుతోంది. ఇప్పటికే భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్… భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పాక్ నిలిపివేసినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశమైంది. 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. వీక్లీ ఢిల్లీ నుంచి లాహోర్‌కు రాకపోకలు సాగించే ఈ ట్రైన్ సర్వీసును ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ నిలిపివేసినట్లు తెలిసింది. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారత సినిమాలను తమ దేశంలో ప్రదర్శించకుండా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.

ప్రస్తుతం ప్రదర్శిస్తున్న బాలీవుడ్ సినిమాలను వెంటనే నిలిపివేయాలనీ, అలాగే కొత్త సినిమాలను కూడా తాము అనుమతించబోమని పాక్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు డా. ఫిరదౌస్ అషిక్ అవాన్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ లోని జైషే ఉగ్రవాద స్థావరంపై భారత్ దాడిచేయడంతో పాక్ భారత సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించింది. పాక్ థియేటర్లకు 70 శాతం ఆదాయం భారతీయ సినిమాల ద్వారానే వస్తోంది. గతేడాది అక్కడ 21 పాకిస్థానీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఒక్కో బాలీవుడ్ సినిమా పాక్ లో రూ.3 నుంచి 4 కోట్ల వరకూ అర్జిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా రూ.37 కోట్ల కలెక్షన్ తో పాకిస్థాన్ లో టాప్ గా నిలిచింది. అయితే పాకిస్థాన్ నిర్ణయంతో భారత్ కు పెద్దగా జరిగే నష్టమేం లేదంటున్నారు నిపుణులు.

Related posts