telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఇక ఏపీ ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు: చంద్రబాబు

APSRTC,Woman Drivers
ఇప్పటి వరకు  ఆర్టీసీలో మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ, ఆర్టీసీలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించామన్నారు. శుక్రవారం గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ భారతదేశానికి గొప్పవరమని అన్నారు.  
ఎన్టీఆర్‌ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో సమానహక్కు ఉండాలని ఆనాడు చట్టం తీసుకొచ్చారన్నారు. తొలిసారి మహిళలకు విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు  గుర్తు చేశారు. మహిళలపై నిర్లక్ష్య ధోరణి పోవాలన్నారు.  రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ డ్వాక్రా సంఘాలని అన్నారు.  డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి తెస్తామన్నారు.  డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, ఇవాళ 98 లక్షల మందికి రూ.3,500 ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

Related posts