telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హోదా, విభజన అంశాలపై .. పోరాటాలు చేయండి.. : ఏపీసీఎం

నేడు ఎంపీ లతో జరిగిన సమావేశంలో ఏపీసీఎం జగన్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకుంటూనే ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం సాగించాలని సూచించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశం వివరాలను ఎంపి మిథున్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. విభజన హామీలను సాధించుకునే అంశం, రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని, అందుకు పార్లమెంట్‌లో వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారని చెప్పారు. ఈ సారి సమావేశాల్లో కూడా ప్రత్యేక హోదా అంశానికే ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. పోలవరానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదేనని, పోలవరం నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరాలని సూచించారన్నారు.

రాబోయే రోజుల్లో కాపర్‌ డ్యాం పూర్తయితే భూ సేకరణకు దాదాపు రూ.10వేల కోట్లకు పైగా అవసరముంటుందని, దాని మీద కూడా ఇప్పటి నుంచి కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామన్నారు. కేంద్రం పై అన్ని విధాలా ఒత్తిడి తెచ్చి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు. రామాయపట్నం పోర్ట్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు విషయంలో పేచీ పెట్టిన నిధులు, కేంద్ర విద్యాలయాలకు ఇవ్వాల్సిన నిధులు, కాగ్‌ చెప్పినట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంపై సమావేశంలో చర్చించామన్నారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రతి విషయం గురించి అధ్యయనం చేసి వాటన్నిటీ మీద పోరాడాలని, రాష్ట్రానికి మేలు చేసేలా ఎంపిల పనితీరు ఉండాలని సిఎం దిశానిర్దేశం చేశారన్నారు. గత సమావేశాల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించామని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరామని అన్నారు.

Related posts