telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీసీఎం అమెరికా పర్యటన .. ఇలా …

jagan wife bharathi

అమెరికా పర్యటనకు ఏపీసీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి అమెరికా వెళ్తున్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి అమెరికా పయనమయ్యారు. వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాసాంధ్రులు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్ రేపు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కె బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రసంగించనున్నారు. జగన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని అధికారులు తెలిపారు. తన చిన్న కుమార్తె వర్షారెడ్డిని అక్కడి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్చడంతో పాటు పలు అధికార, అనధికార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉన్నాయని, ఈ ఖర్చులను ఆయనే భరిస్తారని అధికారులు పేర్కొన్నారు.

భారత కాలమానం ప్రకారం, నేటి సాయంత్రం 6 గంటలకు జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అదే రోజు అమెరికాలో భారత రాయబారితో భేటీ అవుతారు. అనంతరం ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం అమెరికాలోని భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు డల్లాస్ చేరుకుని సాయంత్రం అక్కడి కన్వెన్షన్ సెంటర్‌లో ప్రసంగిస్తారు. 18న వాషింగ్టన్ డీసీలోని వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. 19 నుంచి 21 వరకు వ్యక్తిగత పనులపై పర్యటించనున్నారు. 22న మధ్యాహ్నం షికాగోలో మరికొంత మంది ప్రతినిధులను కలిసి రాత్రి 8:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.

Related posts