telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వలస ఓటర్లపై పార్టీ నేతల దృష్టి..ప్రత్యేక బస్సుల ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల నేతలు  వలస వెళ్లిన ఓటర్లపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా, బెంగళూరు హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు తమ నేతలకు వేయించేకునేందుకు ఓటర్లను సొంతూళ్లకు తీసుకువెళ్లడంతో పాటు మళ్లీ తిరిగి బెంగళూరు, హైదరాబాద్ చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు, ప్రయాణ సమయంలో ఇతరత్రా ఖర్చులను కూడా వాళ్లే బరిస్తున్నారు. ఇలా హైదరాబాద్ నుంచి సొంతూళ్ల వెళ్లే ఓటర్లు దాదాపు 10 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సొంతూళ్లో ఓటేసేందుకు భాగ్యనగర వాసులు భారీ సంఖ్యలో తమ ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. రెగ్యులర్‌ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లలోనూ రిజర్వేషన్లు నిండిపోవడంతో చాలామంది జనరల్‌ బోగీలను ఆశ్రయించారు. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాలకు బయల్దేరిన రైళ్లలో సాధారణ బోగీలు సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కిటకిటలాడాయి. 
హైదరాబాద్  నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు వెయ్యి ప్రైవేట్‌ బస్సులు కూడా కిక్కిరిసిపోయాయి. ఈ రద్దీని సొమ్ము చేసుకొనేందుకు పలు ట్రావెల్స్‌ సంస్థలు యథావిధిగా తమ దోపిడీ కొనసాగించాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేశాయి. కొంతమంది ఆపరేటర్లు ఏకంగా రెండు రెట్లు పెంచేసి ప్రయాణీకుల నుంచి అందినంత దండుకున్నారు.

Related posts