telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

2 లక్షల కోట్లు దాటేసిన.. ఏపీ బడ్జెట్..

MLC Elections in AP 5 unanimous

ఏపి ప్రభుత్వం త్వరలో ఎన్నికల వేళ నూతన బడ్జెట్ ను ఉభయ సభల్లోనూ ప్రవేశపెడుతోంది. . అయితే, కొత్త పధకాలు ఉంటాయా..లేక టోకెన్ గ్రాంట్‌గా రైతురక్ష లాంటి పధకాలకు కేటాయింపులు చేస్తారా అనేది చూడాలి. ప్రభుత్వం 2019-20 బడ్జెట్ ను ఏపి ఆర్దిక మంత్రి యనమల శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నందున ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, ఆర్థికశాఖ అధికారులు పూర్తిస్థాయిలో 2019-20 సంవత్సరానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ ను సభ ఆమోదించనుంది.

మొత్తం రూ.2.40 లక్షల కోట్ల ప్రతిపాదనలు రాగా.. ఆర్థికమంత్రి ఆదేశాల మేరకు రూ.2.26 లక్షల కోట్లకు వాటిని కుదించారు. ఈ మొత్తం బడ్జెట్‌లో 4 నెలల కాలానికి సరిపడా బడ్జెట్‌ను (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌) ఉభయ సభలు ఆమోదించనున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.1.96 లక్షల కోట్లకు సవరించారు. దీన్ని మొదట రూ.1.91 లక్షల కోట్లుగా అంచనా వేసిన సంగతి తెలి సిందే. గ్రామీణాభివృద్ధికి అత్యధికంగా సుమారు రూ.32వేల కోట్లు, జలవనరులశాఖకు రూ.16వేల కోట్లు, వ్యవసాయం-దాని అనుబంధ రంగాలకు రూ.15వేల కోట్ల చొప్పున నిధులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఈ బడ్జెట్ లో ఏపి ప్రభుత్వం కొత్త పధకాలు ప్రకటిస్తుందా లేదా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే నిరుద్యోగ భృతి, ఆదరణ, డ్వాక్రా మహిళలకు రూ.10,000 కానుక, పెన్షన్ల రెట్టింపు లాంటి కొత్త పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రూ.10,000 కానుకను మూడు విడతలుగా ఇవ్వనుంది. ఇందులో రెండు విడతలుగా ఇచ్చే రూ.6,000ను ప్రస్తుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో, మూడో విడతగా ఇచ్చే రూ.4,000ను 2019-20 పూర్తిస్థా యి బడ్జెట్లో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించి అమలు చేస్తున్న పథకాలకు తప్ప… ఓటాన్‌ అకౌంట్‌ కాలానికి సంబంధించి కొత్తగా ఏ పథకాలనూ ప్రభుత్వం ప్రకటించదని సమాచారం. కౌలు రైతులకు కూడా ప్రయోజనాలు కలిగించేలా ‘రైతురక్ష’ పథకాన్ని రూపొందించి మేనిఫెస్టోలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఆ పథకం అమలుకు టోకెన్ గ్రాంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. నెలకు రూ.1000 అందిస్తున్న నిరుద్యోగభృతిని 2వేలకు పెంచే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, వచ్చే పూర్తి ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఈ నాలుగు నెలలు అమలు అవుతుంది, ఎన్నికలలో ప్రభుత్వం గెలిస్తేనే బడ్జెట్ అమలు, లేదంటే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తన ఇష్టమైన బడ్జెట్ ను రూపొందించి, దానిప్రకారమే వారి పథకాలు అమలు చేస్తుంది.

Related posts