telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీ చేతిలోకి .. కర్ణాటక .. మద్యం బంద్ .. 144 సెక్షన్..

karnataka govt ball into governor hands

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్టైంది. నేటి అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై జరిగిన ఓటింగ్ లో సంకీర్ణ సర్కార్ ఓడిపోయింది. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 103గా ఉండగా సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా 99మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 105మంది ఓటు వేశారు. 20మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలిపోయింది. సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ వాజూభాయ్ వాలాని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. 14నెలల పాటు అధికారంలో కొనసాగింది సంకీర్ణ సర్కార్. మే-23,2018న సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

సంకీర్ణం కూలిపోవడంతో.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే కానుంది. విశ్వాస పరీక్షలో మ్యాజిక్ ఫిగర్ 103 కాగా బీజేపీకి 105మంది సభ్యుల మద్దతు ఉండటంతో గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. రేపు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. యడ్యూరప్పను తమ నాయకుడిగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశముంది. రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సీఎం అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత సీనియర్ నాయకులతో కలిసి యడ్యూరప్ప గవర్నర్ ని కలవనున్నారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం దగ్గర బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జై బీజేపీ…జై యడ్యూరప్ప అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాట్లాడుతూ…ఇది ప్రజాస్వామ్య విజయం. కొత్త యుగం ప్రారంభమైందన్నారు. కుమారస్వామి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలకు సుస్థిర పాలనను అందిస్తామని హామీ ఇస్తున్నానన్నారు. రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకుతామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. త్వరలో రైతులకు తీపికబురు చెబుతామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దృష్ట్యా బెంగళూరులో 144సెక్షన్ విధించారు పోలీసులు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా రెండురోజుల పాటు 144 సెక్షన్ విధించారు. రెండు రోజులపాటు మద్యం షాప్ లు కూడా బంద్ కానున్నాయి.

Related posts