telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

యాదాద్రి పునర్నిర్మాణంలో .. అపశృతి.. కేసీఆర్ పై విమర్శలు..

another issue raised on yadadri temple

చినజీయర్ స్వామి ఆగమ పర్యవేక్షణలో పునర్నిర్మాణం చేపడుతున్నప్పటికీ.. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో అపచారం చోటు చేసుకుందన్న కథనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్కిటెక్టులు, శిల్పులు వారి అనుమతి లేకుండానే స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శిలపై వెలసినట్టుగా ఉండే నరసింహాస్వామి మూలవిరాట్టు విగ్రహాన్ని తాకడమే కాకుండా.. విగ్రహ ఆకారంలో మార్పు చేశారన్న చర్చ జరుగుతోంది. గతంలో స్వామి తలపై ఉండే ఏడు తలల ఆదిశేషుడికి బదులు ఇప్పుడు ఐదు తలల ఆదిశేషుడిని పునర్నిర్మించినట్టు సమాచారం. గతంలో మూలవిరాట్టు విగ్రహం శాంతమూర్తిగా దర్శనమివ్వగా.. ఇప్పుడది ఉగ్రరూపంలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మూలవిరాట్టుపై మందంగా ఉండే సింధూరాన్ని తొలగించడంతో విగ్రహం అలా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం చినజీయర్‌ స్వామికి తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.

పునర్నిర్మాణంలో శాస్త్ర ప్రకారమే పనులు జరుగుతున్నాయని వైటీడీఏ మాజీ ప్రధాన స్థపతి సలహాదారు సౌందరరాజన్ తెలిపారు. గర్భాలయంలోని స్వయంభువులను ఉలితో చెక్కామన్న ప్రచారంలో నిజం లేదన్నారు. 60, 70ఏళ్లుగా స్వయంభువులకు సింధూరం మందంగా పట్టుకోవడం వల్ల స్వామివారి రూపం కనిపించకుండా ఉండిపోయిందన్నారు. ప్రధానార్చకుల సమక్షంలో ఇటీవల దాన్ని తొలగించడంతో స్వామి వారి రూపం బయటపడిందన్నారు.సింధూరాన్ని తొలగించడం తప్ప విగ్రహాన్ని తాము చెక్కలేదన్నారు. ప్రధాన అర్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. సింధూరం తొలగించడంతో ఇన్నాళ్లు శాంతమూర్తిగా కనిపించిన స్వామి.. ఇప్పుడు కోరలతో ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడని చెప్పారు. పునర్నిర్మాణంలో మూలవిరాట్టును, గర్భగుడిని తాకబోమని సీఎం కేసీఆర్ గతంలో స్పష్టం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణం ఉంటుందన్నారు. కానీ అక్కడ జరుగుతున్న పనులు ఆగమానికి విరుద్దంగా ఉంటున్నాయన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.

Related posts