telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బుధవారం రాత్రి నుంచి మూతపడ్డా అన్న క్యాంటీన్లు..

Anna-Canteen

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన “అన్న క్యాంటీన్లు” బుధవారం రాత్రితో మూతపడ్డాయి. మధ్యాహ్నం భోజనాన్ని యథావిధిగా సరఫరా చేసిన నిర్వాహకులు ఆ తర్వాత సామాన్లు సర్దుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలియని జనం ఎప్పటిలాగే రాత్రి ఏడుగంటల సమయంలో ఆయా క్యాంటీన్ల వద్దకు చేరుకుని మూతపడి ఉండడంతో నిరాశతో వెనుదిరిగారు.

గత ఏడాది సెప్టెంబర్‌ రెండో వారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 73 పట్టణాలు, నగరాల్లో ఒకేసారి 203 అన్న క్యాంటీన్లను తొలివిడత ప్రారంభించిన విషయం తెలిసిందే. డిమాండ్‌ను అనుసరించి వీటి సంఖ్యను ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో పెంచుకుంటూ పోయారు.రోజుకి దాదాపు 3 లక్షల మందికి ఈ క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసేవారు.

పూటకు కేవలం ఐదు రూపాయలకే ఆహార పదార్థాలు సరఫరా చేయడంతో నిరుపేదలు, రోజు కూలీలు ఎక్కువమందికి క్యాంటీన్లలో భోజనం చేసేవారు. క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ‘అక్షయ పాత్ర ఫౌండేషన్‌’కు అప్పగించారు. నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అక్షయపాత్ర సంస్థ కాంట్రాక్టు గడువు జూలై 31తో ముగుస్తుండడం, ఫౌండేషన్‌కు ప్రభుత్వం నుంచి ఎటువంటి పొడిగింపు ఉత్తర్వులు అందకపోవడంతో మూసివేశారు.

Related posts