telugu navyamedia
andhra hasyam political Telangana

ఆంధ్రా కుర్రాడు..హైద్రాబాద్ కు ప్రేమ‌తో రాసిన ఉత్త‌రం.!

Andhra Young Boy Write a Letter to Hyderbad

అమ్మలాంటి నిన్ను చూడాలనిపిస్తోంది. అక్కడ కరోనా ఎక్కువగా ఉందని చెబుతుంటే మనసు విలవలాడిపోతోంది. అవకాశం చిక్కితే ఒక్కసారైనా వచ్చిపోవాలనిపిస్తోంది. అందరి కష్టాల్ని తీర్చే అమ్మకి కష్టం వస్తే మనం తట్టుకోగలమా. మనసు విలవిలలాడిపోదూ. ఇప్పుడు నిన్నుతలచుకున్నా నాకూ అలానే అనిపిస్తోంది. ఖాలీ కడుపుతో ఈ నగరానికి చేరిన ఎందరినో భాగ్యవంతుల్ని చేశావు. పేరుకు తగ్గట్టుగా భాగ్యనగరంగా బాసిల్లుతున్నావ్.

ఎక్కడో ఉత్తరాంధ్రలో మారుమూల పుట్టి పెరిగిన నాకు ఎన్నో నేర్పించావ్. ఎంతో ఇచ్చావ్. అందుకే గట్టిగా ఊపిరి పీల్చుకుని హైదరాబాద్ అని నిన్ను ఒక్కసారి మనసులో అనుకుంటే ఎక్కడ లేని కిక్కు వచ్చేస్తుంది. ఆ ఉత్సాహాన్ని నేను మాటల్లో చెప్పలేను. నాకే కాదు. చాలామందికి ఇదే ఫీల్ కలుగుతుందని నాకు తెలుసు. దానికి కారణం నువ్వు అందించిన బతుకు. ఎర్రబస్సెక్కి నేరుగా నీ దగ్గరకు వచ్చిన నాలాంటి ఎంతోమందికి అన్నం పెట్టావ్. అవకాశాల్ని అందించావ్. లెక్కలేనన్ని ఆనందాల్ని పంచావ్. బతుకు చిత్రాన్ని బయోస్కోపులో చూపించావ్.

చార్మినార్…. ఈ కట్టడం చాలు కదా. గతం చేసిన గాయాన్ని నువ్వు ఏ స్థాయిలో ఎదుర్కొని నిలిచావో చెప్పడానికి. నువ్వు నగరమే కాదు. ఎంతోమంది ఊపిరి. అందుకే ఈ నగరంలో ఏం జరుగుతుందో అని ఎన్నో కోట్ల గుండెలు ఎదురు చూస్తాయి. ఆశీర్వదిస్తాయి. బతుకు పోరులో ఎన్నో వేల జీవులు నీ దగ్గరకు చేరి సేదతీరుతున్నాయి కాబట్టి. వారందరి మూలాలు వేరే చోట ఉన్నాయి.

నీతో అనుబందం ఓ ఆరోగ్యకరమైన వ్యసనం కదా. ఎంత మానుకుందామన్నా నీపై మనసు లాగేస్తుంది. తల్లి లాంటి నువ్వు అందించిన ఆత్మీయతానురాగాలు మనసులో మెలేస్తుంటాయి. అందుకే నాలాంటోడికి రోజులో కనీసం ఓసారైనా నువ్వు గుర్తొస్తావ్. అందుకే పంజాగుట్ట, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, పెద్దమ్మగుడి, సింకింద్రాబాద్, అమీర్ పేట్, మూసాపేట, ఇలా ఒకటా రెండా ఎన్నెన్ని గుర్తొస్తాయో.

మన జీవితాల్లో నుంచి ఓ మంచి మనిషినే అంత త్వరగా తక్కవ చేసి మాట్లాడలేం కదా. అలాంటిది ఓ గొప్ప నగరానివి. అందులోనూ జిందగీని పరిచయం చేసిన మహానగరివి నువ్వు. ఎలా మరువగలను. నీ ఖ్యాతిని ఎలా తగ్గించగలను. ఎవరైనా తగ్గించే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పూర్తయ్యాక ప్రతి ఒక్క యువకుడి చూపు నీ వైపే కదా. దానికి కారణం నీ దగ్గరకు వస్తే చాలు. నీ దగ్గర కాలు మోపితే, అక్కడ శిక్షణ తీసుకుంటే ఇక బతుకుకి ఢోకా ఉండదనే నమ్మకం. అందుకే ఎంత దూరం జరిగినా, ఎంత దూరంలో ఉన్నా నువ్వు అందరి మనసుల్లో, జీవితాల్లోంచి విడదీయ లేని భాగం అయిపోయావ్.

కరోనా వేళ జరుగుతోన్న గందర గోళ పరిస్థితుల్లో అమ్మ లాంటి నీపై దీవేస్తోంది. ఎందుకంటే నీ దగ్గర కరోనా బాగా ఎక్కవగా ఉందని చెబుతుంటే తల్లడిపోతున్నాను. ఒక్కసారి మనసులో ఏదో కలచివేసే భావన కలుగుతోంది. అవకాశం చిక్కితే ఓసారి చూసిరావాలనిపిస్తోంది.

అయినా లోలోపల గట్టిగానే చెబుతోంది త్వరలోనే నువ్వు నీ సహజ ఆకర్షణని సొంతం చేసుకుంటచావని. బిర్యానీ ఘుమఘమల్ని రుచి చూపిస్తావని. మనసు చెబుతుందిలే. నీ ఒడిలో ఇరానీ ఛాయ్ కప్పుని పెదాలకు ఎప్పుడెప్పుడు అందిస్తానా అని ఎదురు చూస్తున్నాను. మన మిత్రులతో భాయి భాయి అనిపించాలని మనసు పరితపిస్తోంది.

అయినా మనలో మన మాట కానీ… కరోనా ఎక్కడ లేదు చెప్పు. లండన్ నుంచి న్యూయార్క్ వరకూ. ఏ నగరాన్నీ వదల్లేదు కదా. అలా అని మనం బతకడం మానేస్తామా. ఓ ఆర్నెలల్లో అంతా సద్దుమణిగాక పంజాగుట్టలోనో, పాతబస్తీలోనో ధూం ధాం చేసుకోపోతామా.

దావత్ లో బగారా రైస్ తో మాంచి ఘాటైన ఏట కూరతో మస్తీ చేసుకోపోతామా. నీకు కష్టం వచ్చింది. కలసి పోరాడతాం. అన్నట్లు చెప్పడం మరిచిపోయాను. మా విశాఖలోనూ కరోనా విజృంభిస్తోంది. నీకు తెలుసా. ఇక్కడ కూడా మా వాళ్లందరికీ జాగ్రత్తగా ఉండమని నాకు తోచినంతలో చెబుతున్నాను.అందుకే అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను.

ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. ఇక ఉంటానే. హమ్మయ్య నీకు ఉత్తరం రాసేసా. ఇప్పుడు గుండెలో బరువు దిగిపోయినట్లైంది. ఇక నిన్ను చూడడమే తరువాయి. ఆ క్షణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నా. ఎంత త్వరగా వీలు చిక్కితే. అంత త్వరగా నిన్ను కలుస్తా. ఇప్పటికింతే… చివరగా ఎందుకో ఓసారి గట్టిగా అనాలనిపిస్తోంది. నువ్వు షంషేర్ నగరానివని. బతుకునిచ్చిన నీపై ప్రేమతో…

Related posts

ఆన్‌లైన్‌ వ్యభిచార కేంద్రంపై పోలీసుల దాడులు

vimala p

జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సినీ నటుడు పృథ్వి

vimala p

జర్నలిజం లో నిష్టాతులను సత్కరించిన శృతిలయ..

vimala p