telugu navyamedia
క్రైమ్ వార్తలు

లోన్‌యాప్ వేధింపులు..లాడ్జీలో పురుగులుమందు తాగి దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌

*లోన్‌యాప్ వేధింపులు..
* పురుగులుమందు తాగి దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌
*అనాథులుగా మారిన ఇద్ద‌రు చిన్నారు..

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న కన్నబిడ్డలను వదిలేసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు భరించలేక వీరు బలవన్మరణం పొందినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే..

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు.

ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మితో వివాహమైంది. నగరంలోని శాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్‌, రమ్యలక్ష్మి టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్ లోన్ యాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోష‌ల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు.

ఈ బాధలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో దుర్గారావు పది రోజుల కిందట ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌గా చేరి అదనపు సంపాదన కోసం ప్రయత్నించారు. ఈలోగా అసభ్యకరంగా ఉన్న ఓ చిత్రానికి రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్‌ చేసి యాప్‌ల నిర్వాహకులు వాట్సాప్‌లో బెదిరించారు.

రెండు రోజుల్లోనే పూర్తి డ‌ప్పును వడ్డీతోసహా చెల్లించకుంటే ఈ ఫోటోతో పాటు అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని హెచ్చరించారు.

ఈ బెదిరింపులకు మనస్థాపం చెందిన దుర్గారావు, లక్ష్మీ  ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. పిల్లలను ఇంటి వద్దే వ‌దిలేసి రాజమండ్రిలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగారు. తాము లాడ్జీలో పురుగుల మందు తాగిన విషయాన్ని దంపతులు బంధువులకు పోన్ చేసి చెప్పారు.  వెంటనే వారు  లాడ్జీకి వెళ్లి పురుగుల మందు తాగిన దంపతులను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మరణించారు.

కాగా.. గతంలో కూడా లోన్ యాప్ వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి.

Related posts