telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రూపాయి ఇడ్లి అవ్వకు సాయం చేస్తానంటున్న .. ఆనంద్ మహీంద్ర ..

anand mahindra helping hand to

రూపాయికే రుచికరమైన ఇడ్లీలు వడ్డిస్తూ పేదల ఆకలి తీరుస్తున్న ఒక అవ్వ వ్యాపారంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర పెట్టుబడి పెడతానంటూ తన మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులో కమలాతాళ్ అనే 80ఏళ్ల వృద్ధురాలిపై ఆనంద్ మహీంద్ర ప్రశంసల వర్షం కురిపించారు. రూపాయికే ఇడ్లీతోపాటు రుచికరమైన సాంబారు, చట్నీ అందించే ఆమె ఎంతో గొప్ప వ్యక్తి అని కొనియడారు. ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంతోపాటు ఆనందం వేస్తుందని, అలాంటి వారికి సాయం చేస్తే బాగుంటుందని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. పేదలకు భోజనం అందించేందుకు అంత కష్టపడుతున్న అవ్వకు తనవంతుగా సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఆనంద్ మహీంద్ర. అందుకే కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో సతమతమవుతున్న ఆ అవ్వ వ్యాపారంలో పెట్టుబడి పెడతానని అన్నారు. ఆమె ఎలాంటి లాభాలను ఆశించకుండా తన వ్యాపారాన్ని చేస్తుందని తెలుసని అన్నారు.

ఆ అవ్వ గురించి తెలిసినవారు వివరాలు తెలియజేస్తే ఆమెకు ఓ ఎల్పీజీ స్టవ్ కొనిస్తానని చెప్పారు. అంతేగాక, నిరంతరాయంగా ఆమెకు ఎల్పీజీ సిలిండర్లను తమ టీం అందిస్తుందని స్పష్టం చేశారు. పొయ్యిలో వచ్చే పొగ ఆమె ఆరోగ్యానికి మంచిది కాదని మహీంద్ర వ్యాఖ్యానించారు. ఆమెకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. తమిళనాడులోని పెరూర్‌కి సమీపంలోని వడివేలయంపాలయం గ్రామంలో నివసించే కమలాతాళ వయస్సు మీదపడుతున్నప్పటికీ ఎలాంటి అలసట లేకుండా.. వందలాది మందికి రూపాయికే ఇడ్లీలను అందిస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచే వేడి వేడి ఇడ్లను తయారు చేసి ఆకలితో వచ్చే పేద కార్మికులు, ప్రజలకు వడ్డిస్తుందీ అవ్వ. బయట ఎక్కడ తిన్నా 20 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారని.. ఈ అవ్వ మాత్రం రూపాయికే ఇడ్లీలు అందిస్తూ తమ లాంటి వాళ్లను ఆదుకుంటోందని అక్కడికి వచ్చే కార్మికులు అంటున్నారు. ఒక్కోసారి రూపాయి ఇవ్వకున్నా కూడా ఇడ్లీలు పెడుతుందని చెప్పుకొచ్చారు.

ఆయన ట్వీట్‌కు మద్దతు పలుకుతూ ముందుకొచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. తాము కూడా ఆమె సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. దేశానికి సేవ చేసే వారికి తమ సహకారం ఉంటుందని తెలిపింది. ఆ అవ్వకు ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ స్టవ్, రెగ్యూలేటర్ అందిస్తామని స్పష్టం చేసింది.

Related posts