telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుతో అపురూప  జ్ఞాపకమ్

An 38 years extraordinary memory of Chandrababu
కాలం కళ్ళెం లేని గుర్రంలా పరుగులు తీస్తూనే వుంది . రోజులు , నెలలు , సంవత్సరాలు కళ్ళ ముందు నుంచి వెళ్లిపోతున్నాయి . 38 సంవత్సరాల నాటి అపురూపమైన జ్ఞాపకం . ఆరోజు రోజు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ  శాఖా  మంత్రి గా వున్న నారా చంద్ర బాబు నాయుడును మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు ఆహ్వానించాము . అప్పుడు  టి . అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నారు 
అప్పుడు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా జి ఎస్ వరదా చారి గారు కార్యదర్శిగా నేను వున్నాము. ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక కు హైద్రాబాద్లో ఇంచార్జి గా ఉండేవాడిని . ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు సినిమా రంగ ప్రముఖులను ఆహ్వానించి వారితో ఇష్టాగోష్టి సమావేశాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉండేది అలా అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి గా వున్న చంద్ర బాబు నాయుడు గారిని  ఆహ్వానించడానికి న్యూ ఎమ్మెల్యే  క్వార్టర్స్ కు నేను మరో ఇద్దరు మిత్రులతో కలసి వెళ్ళాను  . అప్పుడు ఆయనతో పాటు ఒంగోలు కు చెందిన యువ నాయకుడు కరణం  బలరాం వున్నారు . 
బలరాం గారిని చంద్ర బాబు నాయుడు నాకు పరిచయం చేశారు . వారిద్దరూ మంచి స్నేహితులు . “మాది కూడా ప్రకాశమా జిల్లాయే ” అన్నాను బలరాం గారితో . ” ఏ వూరు” అని అడిగారు . “నాగండ్ల ” చెప్పాను . “మోహన్ రావు గారు తెలుసా ?” అన్నారు నా వైపు చూస్తూ . “కోయ మోహన్ రావు గారా ?” అన్నాను . “అవునవును … ఆయన రాజకీయాల్లో నాకు గురువు ” అన్నాడు. “మోహన్ రావు గారు , వేంకటాద్రి గారు నాకు బాగా కావలసిన వారు ” అన్నాను . 
బలరాం ఆప్యాయంగా నాకు షేక్ హ్యాండ్  ఇచ్చారు . ఈ సంభాషణ అంతా విని .. “మీరు మీరు ఒకే జిల్లా వారు … నేను పరిచయం చెయ్యవలసి వచ్చింది ” అని చంద్ర బాబు నవ్వారు . ఆ తరువాత మేము  వచ్చిన పని చెప్పాము . చంద్ర బాబు మార్చి 16 సాయంత్రం 6. 30 గంటలకు వస్తామని చెప్పారు . 
పి . ఏ ని పిలిచి ప్రోగ్రాం నోట్ చేసుకొమ్మని చెప్పారు . ఆ తరువాత ఫిలిం జర్నలిస్టులకే కాకుండా దిన పత్రికల్లో పనిచేసే మిత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము . హైదరాబాద్  బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో సమావేశం చంద్ర బాబు నాయుడు గారు కరెక్టు గా ఆరున్నర గంటలకు వచ్చారు .  వారు మాట్లాడిన తరువాత జర్నలిస్టు మిత్రులు అనేక ప్రశ్నలు అడిగారు మద్రాస్ లో వున్నతెలుగు  సినిమా రంగాన్ని హైదరాబాద్ కు తరలిస్తామని ఈ సందర్భంగా చంద్ర బాబు హామీ ఇచ్చారు . దాదాపు రెండు గంటల సేపు జర్నలిస్టు మిత్రులతో చంద్ర బాబు నాయుడు గడిపారు 
– భగీరథ 

Related posts