telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మర్డర్” ఫస్ట్ లుక్ పై అమృత ఫైర్

amrutha maruthi rao

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను సమర్పిస్తున్న ‘మర్డర్’ చిత్రం ఫస్ట్ లుక్ ను ఫాదర్స్ డే సందర్భంగా వదిలారు. ఈ సినిమాని నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తుండగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్టోరీ విషయానికి వస్తే మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఇది. తండ్రి మారుతీరావుని కాదని, తను ప్రేమించిన ప్రణయ్‌ని అమృత వివాహం చేసుకోవడం, అది ఇష్టం లేని అమృత తండ్రి ఆ ప్రణయ్‌ని మర్డర్ చేయించడం, ఆ తర్వాత కొద్ది రోజులకే అమృత తండ్రి మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటనలు అందరికీ తెలిసినవే. ప్రేమ, పగల మధ్య నలిగిపోయిన వ్యక్తుల సంఘర్షణతో రాబోతున్న ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్‌లైన్‌ను వర్మ సెట్ చేశాడు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌‌‌ను మారుతీరావు పాత్ర కోసం తీసుకున్న వర్మ, ఆయన తన కుమార్తె అమృత పాత్రకు సాహితి అవంచను తీసుకున్నారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం అమృత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పోస్టర్ ఫస్ట్ లుక్ ను చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని అన్నారు. ప్రేమించిన వ్యక్తికి, కన్న తండ్రికి దూరమైన తన జీవితం తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు.

ఇప్పటికే తాను ఎన్నో సమస్యలు ఎదురుకొంటున్నానని, ఇప్పుడు వర్మ రూపంలో కొత్త సమస్య వచ్చి పడిందని అన్నారు. దీనిని ఎదురుకోడానికి శక్తి కూడా లేదని, ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా రావడం లేదని అన్నారు. కొడుకుతో కలిసి ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతున్న తన జీవితాన్ని బజారున పెట్టొద్దని, మహిళలను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి వర్మకు లేకపోవడంతో ఆయనపై జాలివేస్తుందని అన్నారు. రెండు నిమిషాల పేరు కోసం వర్మ ఇంత నీచానికి దిగజారుతాడని ఊహించలేదన్నారు. వర్మపై కేసు వేసే ఉద్దేశం లేదని అతడు కూడా ఈ నీచ సమాజంలో ఒకడని పేర్కొన్నారు. ఎన్నో బాధలు అనుభవించిన తనకు ఇది పెద్ద లెక్కలోకి రాదని పేర్కొన్న అమృత చివర్లో ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ముగించారు.

Related posts