telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సహనంతో ఉండకపోతే.. చర్యలు తప్పవు.. ఇరాన్ కు అమెరికా హెచ్చరికలు.. !

america warining to iran on

ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఓ యుద్ధనౌకను, క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించనున్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది. ఆ ప్రాంతంలోని అమెరికన్ సైనిక దళాలపై ఇరాన్ దాడులు చేయనున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. భూమి, నీటిపై ప్రయాణించగల వాహనాలు, యుద్ధ విమానాలను రవాణా చేయగల యుద్ధ నౌక ఆర్లింగ్‌టన్‌ను, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఆ ప్రాంతానికి పంపనున్నట్టు పేర్కొంది.

ఇప్పటికే మధ్యాసియాలో మోహరించి ఉన్న తమ యుద్ధ నౌక అబ్రహాం లింకన్, బీ-52 బాంబర్ టాస్క్ ఫోర్స్‌కు ఇవి అదనంగా ఉంటాయని తెలిపింది. ఇరాన్‌తో ఘర్షణను కోరుకోవడం లేదని, అయితే తమ సైనిక బలగాలను, ప్రయోజనాలను కాపాడుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై సెనేట్ సాయుధ సేవల కమిటీ చైర్మన్ జిమ్ ఇన్‌హోఫ్ మాట్లాడుతూ, యుద్ధ నౌకలను మోహరించడం ద్వారా ఇరాన్‌ను వెనుకకు తగ్గాలి లేదా మా సత్తా చూపుతాం అంటూ అమెరికా ఓ స్పష్టమైన సందేశం ఇస్తున్నది అని పేర్కొన్నారు.

అగ్ర రాజ్యాలతో ఇరాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా గత ఏడాది వైదొలిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఇరాన్‌పై ఆర్థిక భారం పెంచుతున్నది. దీనిపై స్పందించిన ఇరాన్.. తమతో ఒప్పందం చేసుకున్న ఐరోపా, చైనా, రష్యా ఆంక్షల నుంచి తమకు 60 రోజుల్లో ఉపశమనం కలిగించకపోతే యురేనియం నిల్వలను మరింత పెంచుతామని ఇటీవల హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ తన పొరుగునే ఉన్న యెమెన్‌లోకి ఖండాంతర క్షిపణులను రహస్యంగా తరలించి యుద్ధానికి సన్నద్ధమవుతున్నదని అమెరికన్ సైన్యాధికారి జనరల్ కెన్నెత్ మెకెన్జీ ఇటీవల ఆరోపించారు.

Related posts