telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్ని ప్రాంతాల అభివృద్ధే నా లక్ష్యం: సీఎం జగన్

అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. నిన్న రాత్రి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని తొలగిస్తున్నామని విపక్షాలు చేస్తున్న ప్రచారం పూర్తి అవాస్తవమని చెప్పారు. అమరావతి రాజధానిగానే ఉంటుందని, మరో రెండు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

అమరావతి అంటే తనకు ఇష్టం లేదని తెలుగుదేశం చేస్తున్న ప్రచారాన్ని జగన్ తిప్పికొట్టారు. ఈ ప్రాంతమంటే తనకెంతో ఇష్టమని, అందుకే తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని, అంత ప్రేమ ఉన్న చంద్రబాబుకు ఇంతవరకూ సొంత ఇల్లే లేదని గుర్తు చేశారు. తనకు ఇష్టం లేకుంటే, ఇక్కడే అసెంబ్లీ సమావేశాలను ఎందుకు పెడతానని ప్రశ్నించారు.

అమరావతి అనే ప్రాంతం విజయవాడలోనూ లేదని, గుంటూరులోనూ లేదని వ్యాఖ్యానించిన జగన్, గత ప్రభుత్వం చూపిన గ్రాఫిక్స్ వల్ల అమరావతి అన్న నగరం ఏర్పడిందని ప్రజలను నమ్మించారని అన్నారు. భవిష్యత్తులో విజయవాడ, గుంటూరుల మధ్య ఓ మహానగరం ఏర్పడుతుందన్నారు. రాజధాని నిమిత్తం భూములిచ్చిన ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదని, నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

Related posts