సామాజిక

వార్తలు… వాతలు…

వొళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు ఇవ్వండని రేడియో వారికి పైవారి హుకుం

మాజీ ఎలక్షన్ కమీషనర్ శ్రీ టీ.ఎన్.శేషన్ గురించిన సోషల్ మీడియా వార్తలు తొందరపాటులో తప్పులు తొక్కుతున్న చందంగా వుంది. ఇందులో నేను కూడా వున్నాను. త్వరగా స్పందించాలి అనే యావలో నేనూ కొన్ని తప్పులు రాసాను. మల్యాల వంటి వారు కొన్ని ఎత్తి చూపారు. వారందరికీ కృతజ్ఞతలు. అవన్నీ సవరించుకుని ఈ పూర్తి కధనం మళ్ళీ సిద్ధం చేసాను.

అప్పట్లో బెజవాడ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా పనిచేసిన శ్రీ ఆర్వీవీ కృష్ణారావును కూడా సంప్రదించాను. చాలా పాత కాలం నాటిది కాబట్టి గుర్తున్నంత వరకు వాస్తవ విషయాలు తెలిపే ప్రయత్నం. మల్యాలవారూ కాస్త ఒక కన్ను ఇటు వేయండి.

ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తా విభాగం అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు ఆయన్ని గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత వచ్చే ఏడూ అయిదు ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ మరణ వార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. పార్లమెంటులో అప్పటి తెలుగు దేశం సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ప్రశ్న రూపంలో లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో దేశంలో ఏడు రేడియో స్టేషన్లు ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి తప్పు చేశాయని తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.

ఏది ఏమైనా ఈ ఉదంతంతో రేడియో అధికారులు మరణ వార్తల ప్రసారం విషయంలో అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు.

తరువాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.

కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. ఢిల్లీ విలేకరి వార్తను ధృవపరచాలి. ఆ సమయంలో ఎవరూ దొరకలేదు. కానీ చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయకపొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.

మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి ఇచ్చినా నిబంధనల పేరుతొ తీసుకోలేదు. ‘తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్లమెంటులో హడావిడి చేసారు.

ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో దొర్లాయి. ఒకటి జగ్జీవన్ రాం మరణ వార్త, రెండోది లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ఈ రెండింటినీ ధ్రువ పరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక కరచుకోవడం జరిగింది.

ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రెడియోవాళ్ళు తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి వుంది. నాకైతే తెలియదు.

– భండారు శ్రీనివాసరావు

Related posts

చంద్రబాబంటే తనకెంతో ఇష్టం: రాందేవ్ బాబా

madhu

రిసార్ట్ లో దారుణం…

admin

అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు సైతం తప్పని లైంగిక వేధింపులు… కేసు నమోదు

nagaraj chanti

Leave a Comment