telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కావాలంటే థియేటర్ ఓనర్లకు ఫోన్ చేయండి… హౌజ్ ఫుల్-4 కలెక్షన్లపై అక్షయ్ స్పందన

Akshay-Kumar

బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, బాబీడియోల్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు కృతి కర్బంద జోడీగా నటించారు. అక్ష‌య్ కుమార్ రాజకుమారుడు బాలా, హ్యారీ పాత్రల్లో పండించిన కామెడీ ప్రేక్షకులను అలరిస్తోంది. అక్టోబర్ 26న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. దీపావళికి రెండు రోజుల ముందు విడుదలైన ఈ సినిమా చెత్తగా ఉందని, అసలు భరించలేకపోయామని ఎందరో సినీ విశ్లేషకులు, నెటిజన్లు ట్వీట్ చేశారు. కేవలం అభిమానులకు మాత్రమే ఈ సినిమా నచ్చింది. కానీ సినిమా కలెక్షన్లు మాత్రం దూసుకుపోతున్నాయి. విడుదలైన వారంలోనే ఈ సినిమా రూ.150 కోట్లు రాబట్టిందట. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు అంతటి స్థాయిలో కలెక్షన్లు వచ్చేంత సీన్ లేదని చాలా మంది సినీ విశ్లేషకులు, నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ‘సర్ నిజంగా ఈ దిక్కుమాలిన సినిమాకు అన్ని కలెక్షన్లు వచ్చాయా?’ అని ప్రశ్నలు వేస్తున్నారు. దీనిపై అక్షయ్ కుమార్ మీడియా వర్గాల ద్వారా స్పందించారు. ‘కలెక్షన్లు వచ్చిన మాట నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ విషయంలో ఎవ్వరూ అబద్ధం చెప్పలేరు.’ అన్నారు. ఇలాంటి నెగిటివ్ టాక్ వస్తున్నందుకు మీరేమన్నా బాధపడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా ‘నేను బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నానా? చాలా మంది చాలా మాటలు చెబుతుంటారు. కానీ నేనెప్పుడూ అలా మాట్లాడలేదు. నేను చదువుకున్న స్కూల్లో నాకు ఒక్కటే నేర్పించారు. మన పని మనం చూసుకోవాలని. అయినా ఎవరేం అనుకున్నా నాకేం ఫరఖ్ పడదు. నిజం చెప్పినా నమ్మకపోతే నేనేం చేయలేను. కావాలంటే థియేటర్ ఓనర్లకు ఫోన్ చేసి కనుక్కోండి. హౌస్‌ఫుల్ 4 సినిమాకు రూ.150 కోట్ల కలెక్షన్లు వచ్చాయని నాకు థియేటర్ ఓనర్లు చెబితే తెలిసింది. నాకు సంతోషమేసి ట్వీట్ చేశాను. అంతేకానీ సొంతంగా నేనేమీ ట్వీట్ చేయలేదు. మీడియాలో ఏదన్నా వార్త తెలిస్తే మీరెలా స్పందిస్తారో నేను కూడా అలాగే స్పందిస్తాను. ఈ సినిమా విడుదలై తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లు సాధిస్తూ వచ్చింది. ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది. ఈ సంస్థ లాస్ ఏంజెల్స్ నుంచి రన్ అవుతోంది. కాబట్టి ఎవ్వరూ ఈ సంస్థకు సంబంధించి తప్పుడు వివరాలు చెప్పరు. కాస్త బుర్ర ఉపయోగించండి. ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు బాక్సాఫీస్ నెంబర్లను సోషల్ మీడియాలో చెప్పకూడదని అంటున్నారు. కానీ దాని వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తాయి. వసూళ్ల గురించి అధికారిక ప్రకటనలు రాకపోతే అభిమానులే థియేటర్స్‌కి ఫోన్ చేసి కనుక్కుంటారు. కాబట్టి ఇలాంటి విషయాలు అధికారికంగా ప్రకటించడమే మంచిది’ అని తెలిపారు అక్షయ్.

Related posts