telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో?: విజయశాంతి

vijayashanthi

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న హైదరాబాదు గాంధీ ఆసుపత్రిపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి టార్గెట్ చేశారు. ఫేస్ బుక్ వేదికగా కేసీఆర్ కు ఆమె సూటి ప్రశ్నలను సంధించారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో.. కొన్ని లోపాలున్నా, వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్‌లో స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన కారణంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారికి కరోనా రావాలని కేసీఆర్ గారు శాపం పెట్టారు.

మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారిపై ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. గాంధీ ఆసుపత్రి జైలులాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారికి బహుశా కేసీఆర్ గారు పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్ గారు, తాను ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ గారిలో ధీమా ఉండి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్ పై కేసీఆర్ గారు శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా? అనే విషయాన్ని వేచి చూడాలని విజయశాంతి పేర్కొన్నారు.

Related posts