telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ: ఊమెన్‌ చాందీ

AICC Umen chandi AP Congress

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో గానీ, మరే ఇతర పార్టీతోనూ కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తుల్లేకుండా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని అన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు గానీ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మాత్రం టీడీపీతో కలిసి పనిచేస్తామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ విధానాలను వివరించేందుకు 13 జిల్లాల్లోనూ బస్సు యాత్రను చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు.

బుధవారం విజయవాడలోని పీసీసీ కార్యాలయంలో చాందీ అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై తమ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలకు చాందీ ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఆయన, రఘువీరా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. విభజన హామీలు అమలు చేసేది, ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని, ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని తెలిపారు.

Related posts