telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీ అస్త్రం.. బరిలోకి దిగనున్న అద్వానీ .. !!

advani from bjp to loksabha

ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీజేపీ నేతలకు వయస్సు అనేది అడ్డుకాకపోవచ్చు. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అనధికార వర్గాల భోగట్టా. అయితే ఈ నిర్ణయంపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. 75 ఏళ్లు పైబడిన నేతలు పోటీ చేయాలనుకుంటే పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్టు సానుకూలంగానే ఉందన్న సమాచారం పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీ అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ తదితరులు 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు మార్గం సుగమమైనట్టే.

91 ఏళ్ల అద్వానీ గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తు, ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే జేడీయూ నేత రామ్ సుందర్ దాస్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన అతి పెద్ద వయస్కుడైన రెండవ వ్యక్తిగా ఆయన నిలుస్తారు. రామ్ సుందర్ దాస్ తన 88వ ఏట హజీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాన్పూర్ నుంచి మురళీ మనోహర్ జోషి గెలిచారు. 1991-93 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అలహాబాద్, వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గాలకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2014లో నరేంద్ర మోదీని వారణాసి నుంచి ఎన్నికల బరిలో దింపాలని పార్టీ నిర్ణయించడంతో మురళీ మనోహర్ జోషి కాన్పూర్ నియోజకవర్గానికి వెళ్లిపోయారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత అద్వానీ, జోషిలను అగ్రనేతలుగా పార్టీ పరిగణిస్తున్నప్పటికీ వారికి పార్లమెంటరీ బోర్డులో మాత్రం చోటు కల్పించలేదు. అయితే అమిత్‌షా పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ‘మార్గదర్శక్ మండలి’ని ఏర్పాటు చేశారు. మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, జోషి, అద్వానీలతో ఈ మార్గదర్శక మండలి ఏర్పాటైంది. మొత్తం మీద, వెటరన్లకు సీట్లు నిరాకరించి వివాదాలకు తావీయడం బీజేపీకి ఇష్టం లేదని, అందువల్లే పోటీకి వయస్సు అడ్డుకాదనే నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే, పార్టీ, ప్రభుత్వ పదవులకు బీజేపీ విధించిన 75 ఏళ్ల వయోపరిమితి మాత్రం యథాప్రకారం కొనసాగనుంది.

Related posts