telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కల్తీ మద్యంతో.. 110 మంది మృతి.. పుల్వామాకు రెండింతలు..శాశ్వత చర్యలు శూన్యమేనా..!

NO ALCOHOL IN TELANGANA

దేశంలో ఎన్నికల సందర్భంగా కాబోలు, మద్యం ఏరులై పారుతుంది. దీనితో కల్తీ కూడా తన పంజా విసురుతుంది. దీని బారిన పడి ఏడాదికి వేలమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా, ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం చేయలేకపోతోంది. దానికి కారణం కూడా అందరికి తెలిసిన రహస్యమే. దాదాపు ఇలాంటివి పెద్దోళ్ల కనుసన్నలలో జరుగుతుండటమే.. ఆ రహస్యం. దానితో కల్తీని అరికట్టేందుకు అధికారులు కూడా ముందడుగు వేయలేక, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, శవ పరీక్షలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే చివరికి, నాయకులే ఇలాంటివాటి వెనుక ఉన్నారు అనేది మరిచి ప్రజలు కూడా ఆవేశంలో అధికారులనే దుమ్మెత్తి పోస్తుండటం ఈ ఘటనలలో కొసమెరుపు. తాజాగా, అస్సాం లో కల్తీ మద్యం తగి 110 మంది చనిపోయారు. బాంబు పేలుళ్లతో 44మంది జవాన్ల ప్రాణాలు ఎంత సంచలనం సృష్టించిందో, ఈ మరణాలు మాత్రం అంతే స్తబ్దుగా కనుమరుగైపోతున్నాయి.

తాజా ఘటన వివరాలలోకి వెళితే, అస్సాంలో కల్తీమద్యం కాటుకు ఏకంగా 110 మంది తేయాకు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు ప్రతిధ్వనిస్తున్నాయి. కల్తీ మద్యం తాగిన వారిలో 31 మంది వెంటనే ప్రాణాలు కోల్పోగా అప్పటి నుంచి గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూ, ఆ సంఖ్య 110కి చేరుకుంది. మరో 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఒక్క గోల్‌ఘాట్ జిల్లాలోనే 59 మంది మృతి చెందగా, జోర్‌హాట్ జిల్లాకు చెందిన వారు 45 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నట్టు స్వయంగా అసోం ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్ విశ్వకర్మ చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, అస్వస్థతకు గురైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. సీఎం సోనోవాల్ జోర్‌హాట్ వైద్య కళాశాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts