telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అద్దంకి టీడీపీలో వర్గపోరు..టిక్కెట్‌ పై ఆశావహుల్లో ఉత్కంఠ?

Addanki Political hot topic Prakasam Dist.

ప్రకాశం జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైన అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు హాటుగానే ఉంటాయి. ఫ్యాక్షన్ తరహా రాజకీయాలతో ఈ నియోజకవర్గం ఎప్పుడు రగిలిపోతుంది. పార్టీల కన్నా ఇక్కడ వ్యక్తుల మధ్య గొడవలతో అద్దంకి అట్టుడుకుతుంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల మధ్య తరచూ వివాదాలు జరుగుతుంటాయి. ఇద్దరు అధికార టీడీపీలో ఉన్నప్పటికీ ఢీ అంటే ఢీ అనడంతో నియోజకవర్గం తరచూ ఉద్రిక్తతంగా మారుతుంది. ఈ గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు గ్రామ స్థాయికి చేరుకోవడంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఫ్లెక్సీలు చించి వేయడం, శిలాఫలకాలు బద్దలు కొట్టడం వంటి ఘటనలు ఇక్కడ మామూలే.

సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండడంతో పార్టీలు ఆ వర్గానికే టికెట్లు కేటాయిస్తాయి. టీడీపీ టికెట్ కోసం ఇద్దరు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుంది మరోసారి గొట్టిపాటి, కరణంల మధ్య పోటీ ఉంటుందా అనే ప్రశ్న నియోజకవర్గంలో ఆసక్తి రేపుతోంది. రవికుమార్‌కు టీడీపీ టికెట్‌ ఇస్తే కరణం, ఆయన వర్గీయులు ఎంత వరకు సహకరిస్తారనేది కీలకం కానుంది. వ్యక్తిగతంగా రవికుమార్‌, కరణం బలరాం వర్గపోరు పక్కన పెడితే ఇక్కడ టీడీపీ మద్దతు దారుల ప్రభావం అధికంగా ఉంటుంది.

వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రవికుమార్‌ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి 4235 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 20 నెలల కిందట అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రవికుమార్‌ రాకను అడ్డుకునేందుకు టీడీపీ సీనియర్‌ నాయకుడు కరణం బలరాం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఆయన టీడీపీలో చేరడమే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటున్నారు. అద్దంకిలో సీటు కేటాయింపు విషయాన్ని టీడీపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ అధినేత ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో పార్టీ బృందం పర్యటించినట్లు తెలిసింది. ఇరువర్గాల మధ్య పార్టీ శ్రేణులు ఎవరికి సహకరిస్తారనే అంశం పై అధిష్ఠానం చర్చించినట్లు సమాచారం.

మరో వైపు 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించిన చెంచు గరటయ్య ఇప్పుడు ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన గరటయ్య పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు టిక్కెట్‌ విషయంలోనే భరోసా దక్కడం లేదు. పార్టీ తీరు పట్ల గరటయ్య అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. టీడీపీ వర్గపోరు తమకు కలిసొస్తుందని వైసీపీ భావిస్తుంది. ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అదిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు వైసీపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఇక్కడ ఇక్కడి రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది.

Related posts