telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అతని దుర్మార్గాలకు అంతం లేదు.. వ్యభిచారి అని ప్రచారం… : నటి విజయలక్ష్మి

Vijayalakshami

తమిళ నటి విజయలక్ష్మి ఈనెల 26న ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. నామ్ తమిళర్ కచ్చి నేత సీమన్, ఓ కుల సంఘం నేత హరి నాడార్‌కు వ్యతిరేకంగా విజయలక్ష్మి ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో వీరిద్దరిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేతల ఇద్దరి మద్దతుదారులు తనను ఆన్‌లైన్ ద్వారా వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే మంగళవారం హాస్పిటల్ నుంచి విడుదలైన విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యం కుదుటపడకపోయినా హాస్పిటల్ నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేశారని, సీమన్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హాస్పిటల్ నుంచి తనను గెంటేయించాడని విజయలక్ష్మి ఆరోపించారు. ‘‘సీమన్ దుర్మార్గాలకు అంతం లేదు. అతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నేను విడుదల చేస్తూనే ఉన్నాను. కానీ, అవేమీ పట్టనట్టు ఆయన ఉన్నాడు. ఆయన స్పందించి ముందుకు వచ్చినట్టయితే ఈ సమస్యను మేం సులభంగా పరిష్కరించుకోగలం. కానీ, ఆయన అలా చేయకుండా నా మీద అర్థంపర్థంలేని వదంతులను వ్యాప్తి చేస్తున్నాడు. అందుకే నేను ఇలా చేయాల్సి వస్తోంది’’ అని విజయలక్ష్మి అన్నారు.

అయితే తన వెనుక బీజేపీ ఉందని వస్తోన్న విమర్శలపై కూడా విజయలక్ష్మి స్పందించారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్ లేదా డీఎంకే.. ఈ పార్టీలేవీ నా వెనుక లేవు. బీజేపీకి చెందిన నా స్నేహితురాలు గాయత్రి రఘురామ్ నన్ను హాస్పిటల్‌లో చేర్పించి, నా ప్రాణాలు కాపాడింది. ఈరోజు ఉదయం నేను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాను. నా ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడలేదు. అందుకే మీడియాను పిలిచి ఇదంతా చెబుతున్నాను. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను హాస్పిటల్ డిశ్చార్జ్ చేసేసింది. ఎవరి ప్రమేయం లేకుండానే ఇలా చేస్తారా? హాస్పిటల్‌లో నా ట్రీట్‌మెంట్‌కు అయిన బిల్లును గాయత్రి చెల్లించింది. అయినప్పటికీ నేను డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆమె ఇక్కడలేదు’’ అని విజయలక్ష్మి స్పష్టం చేశారు. వ్యక్తిగత విషయాలకు రాజకీయ రంగు పులిమి సీమన్ ఎంజాయ్ చేస్తు్న్నారని విజయలక్ష్మి ఆరోపించారు. 2007 నుంచి 2009 వరకు సీమన్, తాను సహజీవనం చేశామని, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తనను పెళ్లి చేసుకోవడానికి సీమన్ అంగీకరించలేదని విజయలక్ష్మి చెప్పారు. సీమన్ పెళ్లిచేసుకోవడానికి అంగీకరించకపోవడం ఇక్కడ సమస్య కాదని, ఆయన నుంచి తనకు బెదిరింపులు రావడంతో చెన్నై కమిషనర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. 2009లో కేసు నమోదు చేయగా.. సీమన్ సెటిల్‌మెంట్‌కు రావడంతో విత్‌డ్రా చేసుకున్నానని చెప్పారు. ఆ తరవాత మీడియా సమక్షంలో తన పరువుకు భంగం కలిగేలా సీమన్ మాట్లాడారని విజయలక్ష్మి అన్నారు. తనను వ్యభిచారి అని ప్రచారం చేశారన్నారు. కాగా విజయలక్ష్మి తెలుగులో “హనుమాన్ జంక్షన్” సినిమాలో నటించారు.

Related posts