telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రచయితగా పేరు ప్రఖ్యాతులు… నాటకాలలో గొల్లపూడికి సాటిలేరు మరెవ్వరూ…

Gollapudi

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు క‌న్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల‌లో న‌టించిన గొల్ల‌పూడి విజ‌య‌న‌గ‌రంలో జ‌న్మించారు. ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య చిత్రంతో న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆయ‌న మృతి టాలీవుడ్ పరిశ్రమ‌కి తీర‌ని లోటు. ఆయన మృతిపై పలువురు సినీ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

గొల్ల‌పూడి మారుతీ రావు సినిమాల‌లోకి రాక‌ముందు అనేక నాట‌కాల‌లో ముఖ్య పాత్ర‌లు పోషించారు. చిన్న వ‌య‌స్సులో రాఘ‌వ క‌ళానికేత‌న్ పేరున నాట‌క బృందాన్ని న‌డిపిన గొల్ల‌పూడి .. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు వంటి నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు, ప్రధానపాత్రధారిగా నటించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించాడు గొల్ల‌పూడి. మ‌న‌స్త‌త్వాలు నాట‌కాన్ని ఢిల్లీలోని త‌ల్క‌తోరా ఉద్యాన‌వ‌నంలో ప్ర‌ద‌ర్శించారు. ఈ నాట‌కం ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. ఇందుకు గాను అప్ప‌టి స‌మాచార‌, ప్రసార శాఖామాత్యుడు బి.వి, కేశ్‌క‌ర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు గొల్ల‌పూడి. గొల్ల‌పూడి చైనా ఆక్రమణ పై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరి లలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చాడు. ఇలా గొల్ల‌పూడి న‌టుడిగా, ర‌చ‌యిత‌గా అల‌రించాడు. బుల్లితెర‌పై కూడా త‌న మార్క్ చాటుకున్నారు గొల్ల‌పూడి. ప్రతిధ్వని అనే కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయ‌న అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. ఇదీ కాక భార్యాభర్తల నేప‌థ్యంలో మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ప్రజావేదిక, వేదిక, దూరదర్శన్, సినీ సౌరభాలు మొదలైన కార్య‌క్రామ‌ల‌ని ఆయ‌న నిర్వ‌హించారు. వీటికి ఎంతో ప్ర‌జాద‌ర‌ణ ల‌భించింది. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు-పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రుః, ఏది నిజం? అనే సీరియ‌ల్స్‌లోను గొల్ల‌పూడి ముఖ్య పాత్ర‌లు పోషించారు.

ర‌చ‌యిత‌గాను మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. ఆయ‌న రాసిన తొలి క‌థ ఆశాజీవి. రేనాడు అనే స్థానిక పత్రిక‌లో డిసెంబ‌ర్ 9,1954న ఇది వెలువ‌డింది. ఇక ఆయన చేసిన కొన్ని రచనలను భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. గొల్ల‌పూడి రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించాడు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.

Related posts