telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

అడవులలో చెట్లు నరికితే.. కఠిన శిక్షలు, త్వరలో చట్టం.. కేసీఆర్

Woman candidates kcr cabinet Telangana

తెలంగాణాలో హరితహారం పేరిట పచ్చదనాన్ని పెంచే బృహత్తర కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం అడవుల రక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఉన్న అడవులను నాశనం చేసుకుని ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఫలితం ఉండదని సిఎం కెసిఆర్‌ అన్నారు. మొక్కలు నాటి పరిరక్షణ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నా అడవులను కాపాడుకునే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలప అక్రమ రవాణదారులు, వన్యప్రాణులను వేటాడేవారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న అటవీ చట్టాలను పూర్తి స్థాయిలో సమీక్షించి కొత్త చట్టం తేవాలని నిర్ధేశించారు. అడవుల్లో చెట్లు నరికితే జైలు పాలవుతామన్న భయం అక్రమార్కుల్లో రావాలని సూచించారు. ప్రస్తుతం ఉనన అటవీ చట్టాల ప్రకారం జాతీయ, రాష్ట్ర జంతువులను వేటాడే నేరాలు మినహా మిగతా నేరాలకు శిక్షలు లేవు. కొద్దిపాటి జరిమానా గరిష్టంగా ఏడాదిలోపు జరిమానా మాత్రమే ఉండటంతో అక్రమార్కులు యధేచ్చగా నేరాలకు పాల్పడుతున్నారని అటవీ అధికారులు గుర్తించారు. ఈ తరుణంలో అటవీ నేరాలకు పాల్పడేవారికి శిక్షలు కఠినంగా ఉండాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొంతమంది అక్రమ రవాణాదారులపై పీడీ చట్టం కింద అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతున్నారు. అయితే అటవీ చట్టాలను కఠినం చేస్తేనే ఫలితం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ చట్టం-2019 సిద్దం చేస్తున్నారు. అటవీ నేరాలకు పాల్పడే వారికి మూడు నుంచి పదేళ్లపాటు శిక్ష పడేలా చట్టాన్ని కఠినతరం చేసేందుకు సిద్దపడుతున్నారు. కొత్త బిల్లు కోసం రూపకల్పన దాదాపు పూర్తయింది. ముసాయిదా బిల్లుకు తుది రూపునిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆమోదం అనంతరం ముసాయిదాను ఖరారు చేస్తారు. నెలాఖరులో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణ అటవీ చట్టం-2019 బిల్లును ఉభయ సభల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. లేదంటే ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశం ఉంది.

Related posts