telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సామాజిక

నేటి నుండే ఆషాఢ బోనాలు .. అంగరంగ వైభవంగా సిద్దమైన గోల్కొండ కోట.. ప్రవేశం ఉచితం..

15 cr funds to bonalu in telangana

నేటి నుండే గోల్కొండ కోట ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో ఆషాఢ బోనాలు ప్రారంభం. లంగర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఈ వేడుకలు ప్రారంభిస్తారు. తొమ్మిది రకాల పూజలతో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలను ప్రారంభించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోల్కొండ బోనాలు లంగర్‌హౌస్‌లో గురువారం ఊరేగింపులతో ప్రారంభం అవుతాయి. లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసే వేదిక వద్ద నుంచి ఈ బోనాలను తెలంగాణ రాష్ట్రం తరఫున మంత్రులు ప్రారంభిస్తారు. దేవాదాయ శాఖ తరఫున సంబంధిత శాఖ మంత్రి లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. అనంతరం పోతురాజుల విన్యాసాలు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శనలతో తొట్టెల ఊరేగింపు ప్రారంభం అవుతుంది.

అనంతరం గోల్కొండ ఛోటా బజార్ వద్ద అనంతచారి ఇంట్లో ఆభరణాల అలంకరణ పూర్తి చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దిగంబర్ పంతులు ఇంట్లోకి తెచ్చి వడి బియ్యం పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగిస్తారు. అనంతరం తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే సర్కార్ బోనం ఊరేగింపునకు కూడా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విశేషం. గోల్కొండ బోనాలను విజయవంతంగా నిర్వహించడానికి పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆసిఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మేరకు డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ గోల్కొండ కోటలో, ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి పర్యటించారు. తొలి రోజు పూజ కోసం లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు జరిగే ఊరేగింపులో నగరంలోని ఐదు ప్రాంతాల టాస్క్ ఫోర్స్ బృందాలు, అదనపు బలగాలు, అశ్విక దళాలు, బాంబ్ స్కాడ్, యాంటీ సెబిటేజ్ బృందం, మహిళా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. ఇది కాకుండా ప్రతి పూజ కోసం డివిజన్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో పాటు అదనంగా బలగాలు బందోబస్తులో పాల్గొంటాయని ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో జరిగే బోనాల రోజుల్లో సందర్శకులు, భక్తులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు కోట పర్యవేక్షక అధికారి భాను ప్రకాశ్ వర్మ తెలిపారు. జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి గురువారం, ఆదివారం గోల్కొండ కోటకు వచ్చే వారిని ప్రవేశ రుసుము లేకుండా అనుమతిస్తారు.

Related posts