telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పెరుగుతున్న కల్తీ మద్యం మృతులు.. 92 కి చేరిన సంఖ్య..

NO ALCOHOL IN TELANGANA

తాజాగా కల్తీ మద్యం తాగి మృతి చెందిన కేసు సంచలనం రేపింది. అయితే మొదట 30గా ఉన్న మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సంఖ్య 92 కు చేరింది. దీనితో అధికారులలో ఆందోళన నెలకొంటుంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులు, నాయకులపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి. వివరాలలోకి వెళితే, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో నాటుసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య 92కి చేరింది. మీరట్‌లో 18 మంది, సహరాన్‌‌పూర్‌లో 46, రూర్కీలో 20, కుశీనగర్‌లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సహరాన్‌‌పూర్‌లో మృతి చెందిన 46 మందికి పోస్టుమార్టం నిర్వహించగా 36 మంది నాటుసారా కారణంగానే మృతి చెందినట్లు తేలిందని అక్కడి జిల్లా మేజిస్ట్రేట్‌ అలోక్‌ పాండ్య తెలిపారు. మిగిలిన నివేదికలు రావాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలైన వాళ్లు దాదాపు 20 మందికి పైగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం అమ్మకాలు జరిపిన వారిని విడిచిపెట్టేది లేదని సహరాన్‌‌పూర్‌ పోలీస్‌ అధికారి దినేష్‌ కుమార్‌ తెలిపారు. బాధ్యులైన వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు.

కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు. రూర్కీకి సమీపాన బలపూర్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి సంస్మరణ కార్యక్రమం నేపథ్యంలో అక్కడి సంప్రదాయం ప్రకారం అందరికీ మద్యం పంపిణీ చేశారు. ఈ విందులో బలపూర్‌ గ్రామానికి ఆనుకుని ఉన్న సహరాన్‌‌పూర్‌, కుశీనగర్‌ ప్రాంతాల్లోని పలు గ్రామాల వారు పాల్గొన్నారు. దీనితో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Related posts