telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

90లు దాటినా .. విశ్రమించని రైతు.. ఇది భారతదేశం అంటే..ఆ రాజుకు ఒక ఓ ఏసుకోండి..

90 years farmer still happy to work

కార్యాలయాలలో కూర్చొని ఏసీలో 8 గంటలు పనిచేసేందుకే ఒత్తిడి పెరిగిపోతుందని హోరెత్తిపోయే ఇప్పటి యువతరానికి ఈ రైతే ఆదర్శం. 91ఏళ్లు వచ్చినా ఒక తాత నేటికీ పొలం పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఆయనే కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి ప్రాంతానికి చెందిన బనవనప్ప పాటిల్‌. కలబురగి ప్రాంతానికి చెందిన బనవనప్ప పాటిల్‌ను చూసిన ఎవ్వరైనా ఆశ్చర్యంలో మునగాల్సిందే. ఎందుకంటే ఆయన యువరైతులా పొలంలో పనిచేయడమే అందుకు కారణం. తొమ్మిది పదులు దాటిన వారెవరైనా మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ గడుపుతుంటారు. కానీ తాత మాత్రం అందుకు భిన్నంగా పొలంలో పనిచేస్తేనే తనకు ఆనందమని అంటున్నాడు. అంత వయస్సులోనూ ఇంత చలాకీగా వ్యవసాయ పనులు ఎలా చేయగలుగుతున్నారు? అని ఎవరైనా అడిగితే తాత ఇలా సమాధానం చెబుతాడు.

చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఈ మట్టితో నాకు ఎనలేని బంధం ఏర్పడింది. పొలంలోకి దిగేముందే ఈ రోజు ఫలానా పని ముగించాలని అనుకుంటా! సాయంకాలంలోపు దానిని ముగించే బయటకు వస్తా. విత్తనాలు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేదాకా కష్టపడటమే నాకు తెలుసు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తూనే ఉంటా. నా పొలంలో నాగలితో దున్నడం, కలుపు తీయడం, నాట్లువేసే పనులులాంటివి చేస్తాను. ఇన్నేళ్లలో నేనెప్పుడూ అనారోగ్యానికి గురికాలేదు. జ్వరమంటే ఏమిటో నాకు తెలీదు. నాకు ఆరుగురు పిల్లలున్నా ఒక్కరికీ వ్యవసాయం చేయడం రాదు. అందుకే నేనొక్కడినే చేయాల్సి వస్తోంది. ప్రతిరోజూ మట్టిలో పనిచేయడం, రోజూ రోటీలు, స్వచ్ఛమైన పాలు, పెరుగును ఆహారంలో తీసుకోవడమే నా ఆరోగ్య రహస్యం. పొలం పనులు నా జీవితంలో భాగమయ్యాయి. ఒక్కరోజు పొలానికి వెళ్లి, పనిచేయక పోయినా నాకేమీ తోచదు. పనిచేస్తున్నప్పుడు వయస్సు అస్సలు గుర్తుకురాదు. కేవలం పని మీదే శ్రద్ధ ఉంటుంది. నేను ఒక రైతును అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అంటున్నాడు బనవనప్ప.

Related posts