telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సాంకేతిక

పెరుగుతున్న మెట్రో సేవలు : మూడోదశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Tharuni Ladies Special Metro Station

హైదరాబాద్‌ మహానగరంలో మూడో దశ మెట్రో రైలు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 29 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ కొత్త లైను కోసం దిల్లీ మెట్రో రైలు సంస్థ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీటైల్డు ప్రాజెక్టు రిపోర్టు-డీపీఆర్‌) సిద్ధం చేసే పనిలో పడింది.బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్‌ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్‌ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) తోడ్పాటు అందించబోతున్నాయి.

హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
* మెట్రో మొదటి దశలో 72 కిలో మీటర్ల పొడవున లైను నిర్మించాల్సి ఉండగా 56 కిలో మీటర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే మియాపూర్‌-ఎల్బీనగర్‌, హైటెక్‌ సిటీ నుంచి నాగోలు కారిడార్‌లో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి.
* రెండో దశలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిర్మించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. డీపీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై రేపోమాపో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.
* మూడో దశ కింద కూడా 29 కిలో మీటర్ల మెట్రో లైను నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆలోచన. దిల్లీ మెట్రో రైలు సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఏ రూటులో మెట్రో లైను నిర్మిస్తే నగర ప్రజలకు రవాణా అందుబాటులో ఉంటుందో ఒక అవగాహనకు వచ్చింది.

మూడో దశ :
బీహెచ్‌ఈఎల్‌ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్‌ మీదుగా ఆల్విన్‌ క్రాస్‌ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్‌, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా లక్డీకాపూల్‌ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది. కొత్తగా ప్రతిపాదిస్తున్న 29 కిలో మీటర్ల లైనులో 20 కిమీ మేర అసలు భూసేకరణ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తేల్చారు. మొదటి దశలో భూసేకరణ వల్లే ప్రాజెక్టు చాలా ఆలస్యమైంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు చాలా వరకు భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కాంట్రాక్టు సంస్థకు అప్పగిస్తే వేగంగా నిర్మాణం చేయడానికి వీలుపడుతుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఇంజనీర్లు చెబుతున్నారు.

Related posts