telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ప్రశాంతంగా .. మూడోవిడత… పోలింగ్..

3rd schedule poling done with peace

మూడో విడత పోలింగ్‌, పశ్చిమ బెంగాల్, యూపీ మినహా మిగతా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 115 నియోజవకర్గాల్లో పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 51.15శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఈసీఐ ప్రకటించింది. సాయంత్రం 5గంటల సమయానికి క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

మొత్తం 1640 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 18.85 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇందుకోసం మొత్తం 117 నియోజకవర్గాల్లో 2.10లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా బలగాలను మోహరించారు. ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించిన ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయని నిర్థారించుకున్నాకే ఓటింగ్‌ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటర్లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అహ్మదాబాద్‌లోని ఓ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేముందు గాంధీనగర్‌లోని తన మాతృమూర్తి నివాసానికి వెళ్లి ఇంటి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తన మాతృమూర్తి వద్దకు వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం అహ్మదాబాద్‌లోని రణీబ్‌ చేరుకొని అక్కడ ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేశారు. అనంతరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానితో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. అనంతరం ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పెద్ద పండుగ అని అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అహ్మాదాబాద్‌లోని షానగర్‌ హిందీ పాఠశాలలో భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ కొనసాగింది. ఉదయం నుంచి ఓటర్లు తరగతి ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లో ఓటు వేసిన మోదీ యువత ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గుజరాత్‌లో 3గంటల వరకు 50.37శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో 26 సీట్లను సొంతం చేసుకున్న భాజపా ఈసారి కూడా అదే ఫలితాలు వస్తాయనే ధీమాతో ఉంది. భాజపాకు ప్రధాన పోటీ ఇస్తున్న కాంగ్రెస్‌ ఈసారి తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం వ్యక్తంచేసింది. గుజరాత్‌లో 4.51కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తంచేశారు.

పోలింగ్ శాతాలు ..:
⇒ అసోం – 62.13
⇒ బిహార్‌ – 46.94
⇒ ఛత్తీస్‌గఢ్‌ – 55.29
⇒ గోవా – 58.39
⇒ గుజరాత్‌ – 50.37
⇒ జమ్ము కశ్మీర్‌ – 10.64
⇒ కర్ణాటక – 49.96
⇒ కేరళ – 54.91
⇒ మహారాష్ట్ర – 44.80
⇒ ఒడిశా – 46.29
⇒ త్రిపుర – 60.84
⇒ ఉత్తర్‌ప్రదేశ్‌ – 46.99
⇒ పశ్చిమ్‌ బంగ – 67.52
⇒ దాద్రానగర్‌ హవేలి – 56.81
⇒ డామన్‌ డయ్యూ – 54.84

Related posts