telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటకీయం : .. స్పీకర్ మూడో డెడ్ లైన్.. బలనిరూపణ జరిగేనా..

karnataka govt ball into governor hands

రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా, అధికార సంకీర్ణానికి కేంద్రంలో ఉన్న బీజేపీ కి జరుగుతున్న పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ప్రజాసమస్యలను చర్చించే వేదిక, కుటిల రాజకీయాలకు ఆలవాలం అయింది. ఒక్క కర్ణాటక రాజకీయాలు యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ బలనిరూపణకు స్పీకర్ రమేశ్ కుమార్ సోమవారం రాత్రి 9 గంటల వరకు విధించిన గడువు కూడా ముగిసినా ఓటింగ్ జరగకుండానే సభ వాయిదా పడింది. దీంతో నేటి సాయంత్రం 6 గంటల వరకు స్పీకర్ మరో డెడ్‌లైన్ విధించారు. ఆ లోపు కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. నిన్న కూడా అసెంబ్లీలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీ వ్యతిరేకించినప్పటికీ స్పీకర్ మాత్రం అధికార పక్షానికి మాట్లాడేందుకు పదేపదే అవకాశం ఇచ్చారు. రెబల్ ఎమ్మెల్యేలు 15 మందికీ ఇప్పుడు ఇంకో భయం పట్టుకుంది. విప్ జారీ చేసే అధికారం పార్టీలకు ఉందని స్పీకర్ రూలింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం. ముంబై హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేలు నేడు సభకు హాజరు కావాల్సిందేనంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీ చేశాయి. ఇంకోవైపు, రాజీనామాలపై విచారణకు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపారు.

ఈ క్రమంలో స్పీకర్‌తో కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బలపరీక్షకు రాత్రి 9 గంటల వరకు సీఎంకు స్పీకర్ సమయం ఇచ్చారు. సుప్రీంకోర్టులో తమ పిటిషన్ పెండింగులో ఉన్నందున మరింత సమయం ఇవ్వాలని కోరినా స్పీకర్ నిరాకరించారు. బలపరీక్షకు సిద్ధం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా స్పీకర్ హెచ్చరించారు. కాగా, సోమవారం రాత్రి వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ అదే గందరగోళం నెలకొంది. దీంతో ఓటింగ్ జరగకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నేటి సాయంత్రం ఆరు గంటల లోపు తన బలాన్ని నిరూపించుకోవాలని కుమారస్వామికి డెడ్‌లైన్ విధించారు. రాజీనామా చేసిన 15 మందితో పాటు మరో నలుగురు సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. మరోవైపు, కాంగ్రెస్ మాత్రం సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకు ఓటింగ్ నిర్వహించరాదని తన వైఖరిని సుస్పష్టంగా చాటుతోంది. ఓ దశలో సీఎం కుమారస్వామి తాజా పరిణామాలతో మనస్తాపం చెంది రాజీనామాకు సిద్ధపడగా, సభను ఎవరైనా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని స్పీకర్ రమేశ్ కుమార్ హెచ్చరించారు.

Related posts