telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ సినిమా వార్తలు

“బడుగు బలహీన వర్గాల కోసమే  తెలుగు దేశం ఆవిర్భవించింది “- ఎన్ .టి  రామారావు .

37 years ago NTR's auspicious interview for NavyaMedia Readers
37 సంవత్సరాలనాటి ఇంటర్వ్యూ … ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది . 
1982 ఏప్రిల్ 1 వ తేదీ గురువారం నాడు  2. 30 గంటలకు రామారావు గారితో రామకృష్ణ స్టూడియోస్  లోని  వారి కార్యాలయంలో చేసిన ఇంటర్వ్యూ . . 
తెలుగుదేశం గట్టి ప్రతి పక్షం అవుతుందని కొందరు , పెద్ద పట్టించుకోవాల్సిన అవసరంలేదని మరి కొందరు వ్యాఖ్యానిస్తుంటే …. ఎన్టీఆర్ మాత్రం అన్ని స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని ,తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రత్యక్షంగానూ , పరోక్షంగానూ అంటున్నారు . కృష్ణుడుగా , రాముడుగా , ప్రజలు తనని ఆరాధిస్తున్నారని , తనంటే  వారికి అచంచలమైన  విశ్వాసం ఉందని , ప్రస్తుత  రాజకీయ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని , ఇట్టి పరిస్థితుల్లో తనలాంటి  నిస్వార్ధ ప్రజాసేవకులు  దేశానికి ఎంతో అవసరమని రామారావు భావిస్తున్నారు . 
అందుచేతనే తానూ రాజకీయాల్లో ప్రవేశించినట్టు ఆయన ప్రకటించారు . ఇంతకాలం సినిమా రంగంలో వున్న రామారావుకు దేశం గురించి ఏమి తెలుసు ? ప్రజలకు ఆయనేం చేస్తారు  అనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి . ఆయన రాజకీయాలలో ప్రవేశించిన తరువాత అనేక ఊహాగానాలు బయలుదేరాయి . మళ్ళీ చిత్రాల్లో నటిస్తారా? సినిమా పరిశ్రమ నుంచి మద్దతు ఉందా? ఒకవేళ తెలుగు దేశం అధికారంలోకి వస్తే దేశానికి ముందుగా ఏమి చేస్తారు ?  ఇలాంటి అనేకమైన సందేహాలను ఎన్ . టి . రామారావు “జ్యోతి “మాస పత్రిక కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నివృత్తి చేశారు . 
“మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు తీసుకునే నిర్ణయాలు ఏమిటి ? మీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి ?”
అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించాను . “ఈనాటి పరిస్థితులకు సతమతమవుతూ , సంసారాలు గడపలేక ,పిల్లల్ని పెంచుకోలేక ,బ్రతుకలేక , చావు బ్రతుకుల మధ్య నలిగిపోయే  బడుగు ప్రజానీకాన్ని తీర్చిదిద్దటం నా పార్టీ లక్ష్యం .  ఉచిత విద్య ,వైద్య సౌకర్యాలు ,పిల్లలకు ఉచిత మధ్యాన్నం భోజనం , ఆరోగ్యకరమైన , నివాస యోగ్యమైన  ఇళ్లను  కల్పించాలనే సంకల్పం . విద్య ద్వారా విజ్ఞానాన్ని  అందించడం ప్రధమ కర్తవ్యమ్ , ఆరోగ్య పరిరక్షణ  ద్వితీయ కర్తవ్యం . విద్యానమ్ముకొనే విధానానికి స్వస్తి చెబుతాం ,విజ్ఞానానికి రక్షణ కలిపిస్తాము .
మురికి గుంటలుగా  మారిన వైద్య శాలలు , అందరికీ అందుబాటులో వుండే పరిశుద్ధమైన , ప్రయోజనకమైన ,ఆదర్శ వైద్యాలయాలుగా తీర్చిదిద్దబడతాయి ఏడంతస్తుల మేడల్లో , ఫైవ్ స్టార్ హోటళ్లలో నిష్ప్రయోజనకరమైన  పనులలో మురిగిపోయే పెట్టుబడినంతా గ్రామీణాభివృద్ధికి , పరిశ్రమాభి వృద్ధికి  కేటాయించి , దేశీయ సంపదను పెంపొందించే  అభ్యుదయ కార్యక్రమాలకు వినియోగిస్తాము . 
జాతీయం చేసిన బ్యాంకు నిధులు బీమా నిధులు  దేశీయ అభివృద్ధికి మరలించబడతాయి . జాతి చైతన్యం స్వయం పోషకత్వం  సాధించడం మా సిద్ధాంతం .
” “మీ రాజకీయా జీవిత పరమార్ధం  ఎంజీఆర్ లా ముఖ్యమంత్రి కావడమేనని అనుకుంటున్నారు . దీనికి మీ సమాధానం ?”
నాకు పదవుల మీద వ్యామోహం లేదు .””మరీ…” “ఆరగించి వదిలేచిన ఎంగిలిని కోరుకోవడం  నాకు అలవాటు లేదు . భగవంతుడు అన్నీ ఇచ్చాడు . పేరు, డబ్బు , సచ్ఛీలం వున్నాయి . ఇంచుమించు సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసిని . ప్రజాసేవ కోసం మిగిలిన వ్యక్తిని .”
“మీరు ముఖ్యమంత్రి అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏరకంగా కృషి చేస్తారు ?”
“సినిమా పరిశ్రమను బాగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా , శ్రామికుడుగా , అందరు చేయలేని అభివృద్ధి నా పరిశ్రమకు నేను చేయగలననే విస్వాసం వుంది”
“ప్రాంతీయ పార్టీని స్థాపించడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి ?”
ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితుల్లో జరుగుతున్న అన్యాయాలు , రోజురోజుకు దిగజారిపోతున్న నైతిక విలువలు , సంఘంలో ప్రబలిపోతున్న దురాచారాలు , ఇవ్వన్నీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయి .  సామాన్య ప్రజానీకానికి ఎదురవుతున్న అనేకనేక  సమస్యలు … తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ప్రోత్సహించాయి “
“ఇన్ని సంవత్సరాలు సినిమా జీవితం ఇవ్వలేని తృప్తి రాజకీయ రంగం ఇస్తుందని భావిస్తున్నారా?”
“ఒకరకంగా అదీ మానవ సేవే . ఇదీ మానవ సేవే .  దైనందిన జీవితంలో  కష్టపడేవారికి మానసోల్లాసం కలిగించేది కళ అయితే దుర్భర పరిస్థితుల్లో  ఆలు బిడ్డలతో ,ఆకలి బాధలతో  అలమటిస్తున్న సాటి పేద ప్రజలకు , పీడిత వర్గానికి చేయూతనివ్వడం , కన్నీళ్లు తుడిచి ఆదరించడం  మహోత్కృష్టమైన పరమార్ధం . మానవ సేవే  మాధవ సేవ , అంతకు మించిన పవిత్రమైన పరమార్ధ స్వరూపం మరోటి ఉండదు . “
“రాజకీయ జీవితానికే అంకితమయి పోతారా? లేక సినిమా జీవితాన్ని కూడా కోన సాగిస్తారా?”
“ఆత్మ తృప్తి కల్గించే  కళ కంటే మానవ సేవలో పునీతమయ్యే రాజకీయ జీవితమే ఉత్తమమైనదని నా నమ్మకం . “
బాలకృష్ణ మీ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆశించవచ్చా? బీ అబ్బాయి భవిష్యత్తుకు మీరేవిధంగా సహాయపడతారు?”
“ఏమో ?”
“అంటే ?”
” నా అంతవాడు అయితే అంతకు మించిన ఆనందం లేదు . నా గౌరవాన్ని నిలిపినవాడు అవుతాడు “
“మీ పార్టీకి మీ అభిమాన సంఘ సభ్యులను ఏరకంగా ఉపయోగించుకోదలిచారు ?”
“క్రమశిక్షణాయుతమైన ఆదర్శ ప్రజాసేవకులుగా వారిని రూపొందిస్తాను ” 
“అభిమానుల అండదండలు మీకు పూర్తిగా వుంటాయ? “
 “తప్పకుండా ఉంటాయి . వారి పూర్తి మద్దతు మా పార్టీకి వుంది “
“మీ అభిమాన సంఘ సభ్యులను  పార్టీ తరుపున అభ్యర్థులుగా నిలబెడతారా ?”
“ఇప్పట్లో ఆ ఉద్దేశ్యం లేదు “
“ప్రస్తుతం నిర్మాణంలో వున్న సినిమాల మాటేమిటి ? మీ వాళ్ళ నిర్మాతలు నష్టపోరా ?”
“బయటి నిర్మాతల చిత్రాలు పూర్తి చేస్తాను .  మా స్వంత సినిమాలు చందా శాసనుడు , సింహం నవ్వింది ,నిర్మాణంలో వున్నాయి . వాటి విషయంలో నాకేమి బాధలేదు . త్యాగానికి సిద్దపడే ఈ నిర్ణయం తీసుకున్నా . ఇక నటిస్తానని ఒప్పుకున్నవి  వీలు కాకపోతే , ప్రస్తుతం వత్తిడి చెయ్యవద్దని వారిని కోరతాను “
“మీ అల్లుడు చంద్ర బాబు నాయుడు మీ పార్టీలో చేరే అవకాశం ఉందా ?”
“వారిష్టం వారిది “”
పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటించే రామారావు గారు  ఇప్పుడు ప్రజా సేవ చేస్తానని అంటున్నాడు … అనే విమర్శ వుంది .. మీరేమంటారు ?”
“అసూయపడే మానవుల ఊహ ఇది . నా మీద నమ్మకం వున్న అశేష ఆంధ్రులు నమ్మకం వమ్ముచెయ్యను . “
“కొత్తవారికి మీ పార్టీలో ఎక్కువ అవకాశం ఇస్తారా?”
‘ఎక్కువ ఉత్సాహవంతులైన యువకులకు , జవాబద్దులైన నూతన ఆవేశ ప్రవాహానికి ఎక్కువ చోటు ఉంటుంది . “
“మీరు సినిమా జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పినట్టేనా?”
“అవసరమైతే స్వస్తి చెబుతాను “
“ఒకవేళ మీరు సినిమా జీవితాన్ని కోన సాగిస్తే మీ పాత్రల పోషణలో మార్పు వస్తుందా ? లేక నిర్మాతల అభిరుచిమేరకు నటిస్తారా ? కాక సమాజాభివృద్ధికి  దోహదం చేసే సినిమాల్లో నటిస్తారా ?”
“మేము  మళ్ళీ చిత్రాల్లో నటిస్తే , పూర్తిగా మార్పు వస్తుంది . నూటికి నూరుపాళ్లు , ప్రజలను , జాతిని , సంఘాన్ని , చైతన్య పరిచే చిత్రాలకు , అలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తాము . ఒక్కసారి ఈ విలువలు చుసిన తరువాత క్రిందికి జారిపోలేము .”
NTR POLITICAL ENTRY INTERVIEW (1)
“తెలుగు సినిమా రంగం నుంచే ఎవరైనా తెలుగు దేశం పార్టీలో చేరేవారు వుంటారా ?”
“ఇంతవరకు ఎవరు రాలేదు . ఒకవేళ వస్తే కాదనను “
“పార్టీ కార్య వర్గంలో అన్ని కులాలకు , మతాలకు ప్రాధాన్యత ఇస్తారా ?”
“అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుంది “
“తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారే అవకాశం ఉందా ?”
“ప్రస్తుతానికి ఇది ప్రాంతీయ పార్టీ మాత్రమే “
“తరువాత ..?”
“చెప్పలేం ” అని ఇంటర్వ్యూ ముగించారు రామారావు గారు . 
( 1982 జూన్ లో   జ్యోతి మాస పత్రికలో ఎన్ . టి .ఆర్  కవర్ పేజీ తో ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైంది )
-భగీరథ 

Related posts