telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మహిళలకు 33 శాతం సీట్లు .. బీజేడీ పార్టీ .. !

33 % seats to women from bjd party

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గానూ తమ బీజూ జనతా దళ్‌ (బీజేడీ) పార్టీ నుంచి మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ఆదివారం ప్రకటన చేశారు. కేంద్రాపఢాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బృంద (ఎస్‌హెచ్‌జీ) సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ‘లెజెండరీ బీజూ బాబు (ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్‌) కర్మ భూమి అయిన ఈ కేంద్రాపఢా నుంచి నేను ఓ విషయంపై ప్రకటన చేస్తున్నాను. ఒడిశా నుంచి పార్లమెంటుకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలు వెళ్తారు’ అని తెలిపారు.

ఒడిశాలోని మహిళలు ‘భారత్‌లో మహిళలు సాధికారత సాధించే దిశగా నాయకత్వం వహిస్తారు. ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనాల్లా అత్యాధునిక దేశం కావాలన్నా అందుకు మహిళా సాధికారతే మార్గం. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడి, ఆ దిశగా అడుగులు వేయాలి’ అని నవీన్‌ పట్నాయక్‌ వ్యాఖ్యానించారు. మహిళల కోసం నిర్మిస్తున్న మిషన్‌ శక్తి భవనం కోసం ఆయన రూ.కోటి మంజూరు చేశారు. కాగా, మహిళలకు లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబరులో ఒడిశా అసెంబ్లీలో ఆయన ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదింప చేశారు. దీనికి భాజపా, కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపాయి. అయితే, ఎన్నికల నేపథ్యంలోనే ఈ ప్రతిపాదన చేశారని విమర్శలు కూడా చేశాయి.

Related posts