telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ప్రియాంకరెడ్డి హత్య కేసులో … ముగ్గురు పోలీసు అధికారులపై వేటు.. జీరో ఎఫ్ఐఆర్‌ పై అవగాహనా రాహిత్యం..

షాద్‌నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. కంప్లైంట్ చేసినా పట్టించుకోలేనే ఆరోపణలు.. పనితీరుపై తీవ్ర విమర్శలు రావడంతో.. చర్యలు తీసుకున్నారు. ఇకపై ఎవరైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన శంషాబాద్‌ పీఎస్‌కు చెందిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. వేటు పడిన వారిలో ఎస్‌ఐ ఎం. రవికుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ ఎ. సత్యనారాయణ, పి. వేణుగోపాల్‌ రెడ్డిలు ఉన్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా.. సకాలంలో స్పందించకపోవడం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో.. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ కుటుంబ సభ్యులు పోలీసులపై ఆరోపణలు చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా.. ఎవరితోనైనా వెళ్లిపోయి ఉంటుందేమో.. అని వ్యాఖ్యానించారని బాధితురాలి తల్లి వాపోయింది. మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళితే తమ పరిధి కాదని పోలీసులు అనడంతో.. తాము రెండు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని బాధితురాలి సంబంధీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తె భయపడుతూ ఫోన్లో మాట్లాడిందని చెప్పినా.. పోలీసులు ఇలా మాట్లాడటం, సీసీటీవీ ఫుటేజీలను చూడటం పట్ల బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఓ రేంజ్‌లో విమర్శలు వచ్చాయి. మొదట వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినా… విమర్శల తీవ్రత పెరగడంతో… పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో… ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

ఇకపై ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే.. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కాదని… వెనక్కి పంపించొద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు స్వీకరించి… చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగాక.. కేంద్రం జీరో ఎఫ్ఐఆర్‌కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి ఎఫ్ఐఆర్‌కు ఓ నెంబర్ కేటాయిస్తారు. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోది కాదని భావిస్తే.. నంబర్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దీన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అనంతరం ఎఫ్ఐఆర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌కు బదిలీ చేస్తారు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలున్నా… తమ పరిధి కాదంటూ పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేయడం వల్లే.. దారుణం జరిగిందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Related posts