telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుమల : సరస్వతి దేవి అలంకారంలో .. శ్రీ మలయప్పస్వామివారు ..

2nd day brahmostav in tirumala

రెండవరోజైన నేటి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు సరస్వతి దేవి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.

శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. వాహనసేవలలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాలలో మూడవరోజైన బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సింహవాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ఊరేగనున్నారు.

Related posts