telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ : .. 200 శాతం పెరిగిన .. ఇంజనీరింగ్ ఫీజులు…

200 times rise in engineering fees

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. 200 శాతానికి మించి ఫీజు పెరుగనుంది. ఈమేరకు కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదించాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రూ.3 లక్షల కానుంది. చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(సీబీఐటీ) సంవత్సరానికి రూ.3 లక్షల ఫీజును ప్రతిపాదించింది. మిగతా 75 ప్రధాన కాలేజీలు కూడా ఫీజుల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీకి (టీఏఎఫ్‌ఆర్‌సీ) అందజేశాయి. ఫీజుల పెంపు కోసం ఇప్పటికే 6 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించి, కాలేజీల వారీగా ఫీజులను ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, ఫీజులు ఖరారయ్యాక మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 2016లో ఖరారు చేసిన ఇంజనీరింగ్ ఫీజుల గడువు 2018-19 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో 2019-20 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లపాటు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని ఫీజుల కమిటీ ఖరారు చేస్తేనే వాటికి చట్టబద్ధత ఉంటుంది. వరుస ఎన్నికల కారణంగా టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ నియామకం మరుగున పడింది. చైర్మన్‌ నియామకం జరిగేలోపు టీఏఎఫ్‌ఆర్‌సీ సభ్య కార్యదర్శి హోదాలో విద్యాశాఖ కార్యదర్శి ఫీజుల ప్రతిపాదనల స్వీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

యాజమాన్య ప్రతిపాదిత ఫీజులను అమలు చేస్తే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇంకా కోర్టు ఆర్డర్‌ కాపీ అందలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. టాప్ కాలేజీల్లో యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాల్సి వస్తే సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల పెంపును అమలు చేయాల్సి వస్తుంది. టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ నియామకం తరువాత కొత్త ఫీజులను ఖరారు చేశాక మిగులు ఫీజులను సర్దుబాటు చేయాలని పేర్కొన్నప్పటికీ ముందుగా ప్రతిపాదిత ఫీజును చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రవేశాల కమిటీ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. (జూన్ 27, 2019)వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వుల కాపీ అందనప్పుడు, అప్పీల్‌కు వెళ్లనప్పుడు (జూన్ 27, 2019)వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లను ప్రారంభిస్తారా? లేదా? అన్న గందరగోళం నెలకొంది.

కాలేజీల వారీగా ఫీజులను వెబ్‌ ఆప్షన్ల సమయంలోనే ఖచ్చితంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. (జూన్ 27, 2019)వ తేదీలోగా కోర్టు ఉత్తర్వులు అందితే అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసి, కోర్టు ఉత్తర్వుల కాపీ అందాకే అప్పీల్‌కు వెళ్లాలని, ఆ తరువాతే వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుతో విద్యార్థులపై మరింత భారం పడనుంది. తమ పిల్లలను బీటెక్ చదివిచాలంటే ఎగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం ఆలోచన చేస్తున్నారు.

Related posts