telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కోచింగ్‌సెంటర్‌లో మంటలు..19 మంది విద్యార్థులు దుర్మరణం

fire accident bldg

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో ఉన్న తక్షశిల కమర్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి తీవ్ర రూపం దాల్చి పై అంతస్తులకు పాకాయి. భవనం మొత్తం పొగ తో నిండిపోయింది. నాలుగంతస్తుల భవనంలో ఓ కోచింగ్ సెంటర్ కొనసాగుతున్నది. తరగతులు జరుగుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పలువురు విద్యార్థులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంలోని కిటికీల్లో నుంచి కిందకి దూకేశారు. ప్రమాదంలో మొత్తం 19 మంది మృతిచెందారు.

వీరిలో కొందరు విద్యార్థులు మంటల్లో చిక్కుకొని మృతిచెందగా, మరికొందరు పైనుంచి పడి తీవ్రగాయాలై ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్‌లో దాదాపు 50 మంది విద్యార్థులున్నట్టు సమాచారం. పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. షార్ట్‌సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణం కావొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులుగా తేలినవారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు సూరత్‌కు బయలుదేరి వెళ్లారు. గుజరాత్ డిప్యూటీసీఎం నితిన్ పటేల్ మాట్లాడు తూ మృతుల్లో ఎక్కువ మంది పైనుంచి దూకడం వల్లే చనిపోయారని తెలిపారు.

Related posts