telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

15 ఏళ్ల క్రితం పదివేలతో దుబాయ్ కి… ఇప్పుడు…!!

Indian

భారత ప్రవాసుడైన సాజి చెరియాన్ అనే బిజినెస్ మ్యాన్ అబుదాబిలోని ఫూజైరహా నగరంలో స్థిరపడ్డాడు. సాజి కేరళకు చెందిన క్రిస్టియన్ మతస్తుడు. కాగా రంజాన్ ప్రవిత్ర మాసాన్ని పురస్కరించుకొని అక్కడ పనిచేసుకొని జీవనం సాగిస్తున్న పేదల(బ్లూ కాలర్ వర్కర్స్)కు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి వారి కడుపు నింపుతూ మనసున్న మహారాజు అనిపించుకుంటున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ఏసీ కన్వేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. దాంతో ఆ పేద వర్కర్స్ రంజాన్ మాసం మొత్తం ఇక్కడే వచ్చి వారి ఉపవాస దీక్షలను విరమిస్తున్నారు. ఆ సమయంలో వారికి కావాల్సిన అన్ని ఆహారపదార్థాలను సాజి ఉచితంగా అందిస్తున్నాడు. గతేడాది ఫూజైరహాలో ప్రత్యేకంగా వారికోసం ఓ మజీద్‌ను కూడా నిర్మించాడు చెరియాన్. అంతేగాక ముస్లింలు రంజాన్ మాసంలో పాటించే రోజా(ఉపవాసం)ని కూడా పాటిస్తున్నాడు. సాజి అక్కడి నిరు పేదలకు, ప్రవాసులకు ఇలా సేవ చేయడానికి కారణం తాను మొదట అబుదాబిలో అడుపెట్టిన తొలిరోజుల్లో ఆయన అనుభవించిన పరిస్థితులే అని చెబుతున్నాడు చెరియాన్.

2004లో విజిటింగ్ వీసాపై కేవలం రూ. 10వేలతో దుబాయి విమానాశ్రయంలో దిగాడు. తన కలలు నేరవేర్చుకోవడానికి కోటి ఆశలతో ఫూజైరహా నగరాన్ని ఎంచుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత నెలల తరబడి పని దొరకలేదు. తీసుకెళ్లిన డబ్బులు అయిపోయాయి. దాంతో పూట గడవటం కూడా కష్టంగా మారిపోయింది. డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటునే పనికోసం వెదికాడు. సివిల్ ఇంజినీర్ చదివిన సాజి చివరకు ఓ చిన్న ప్రాజెక్ట్‌తో తన ప్రస్తానాన్ని ప్రారంభించి ఇవాళ ఓ వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. సౌకర్యవంతమైన జీవనం సాగిస్తున్న తాను అవసరానికి మించి ఉన్న డబ్బును ఇలా పేదలకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు. దీనికి తన భార్య ఏల్సీ, పిల్లలు సచిన్, ఎల్విన్ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పాడు. అలాగే తన పుట్టిన ఊరు కేరళలోని కాయంకులంలో నిరుపేదల కోసం 20 ఇళ్లు కూడా నిర్మించేందుకు సాజి ప్లాన్ చేస్తున్నాడు. పుట్టినప్పడు ఏం తీసుకురాలేం, అలాగే చనిపోయినప్పడు కూడా ఏం తీసుకెళ్లలేమని చెబుతున్న చెరియాన్ ఇలా నిరుపేదలకు ఒక పూట భోజనం పెట్టడంతో ఎంతో సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నాడు.

Related posts