telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

ఆషాఢ బోనాల ఉత్సవాలకు .. అంతా సిద్ధం.. 15కోట్ల నిధులు..

15 cr funds to bonalu in telangana

పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో కీలకమైన ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్‌లో జూలై 4 నుంచి ప్రారంభంకానున్నట్టు చెప్పారు. 4న గోల్కొండ బోనాలు, 21న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 28న పాతబస్తీలో బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే బోనాల పండుగ ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్‌అలీ, దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆయాశాఖల అధికారులతో తలసాని సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ ఏడాది బోనాల సంబురాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్, దసరా, బోనాల పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.22 కోట్లతో వివిధ పనులకోసం ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం, దేవాలయాల వద్ద లైటింగ్ ఏర్పాట్లుచేయాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం జలమండలి మూడులక్షలకుపైగా వాటర్ ప్యాకెట్లను సిద్ధంచేయాలని సూచించారు. భక్తులకు ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా దేవాలయాల వద్ద బారికేడింగ్ సిద్ధంచేయాలన్నారు.

Related posts