telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

వయసు పదమూడే .. ప్రఖ్యాత రచయితలా .. 135 రచనలతో గిన్నిస్ రికార్డు …

13 years boy written 135 books and got record

రచయిత అంటే పాఠకులను తన రాతల ద్వారా మెప్పించగలగాలి. అంటే సమాజంలోని ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించగల నైపుణ్యం ఉండాలి. పదమూడు సంవత్సరాల బాలుడు రచయితగా 135 పుస్తకాలను రచించడం గురించి మీరు విన్నారా? అతనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన మృగేంద్రరాజ్‌. ఇప్పటి వరకూ అతని పేరు మీద నాలుగు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రెండు బయోపిక్‌లు కూడా తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫజియాబాద్‌ మృగేంద్రరాజ్‌ సొంతూరు. తల్లి సుల్తాన్‌పూర్‌ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తండ్రి ఉత్తరప్రదేశ్‌ షుగర్‌ ఇండిస్టీ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తున్నాడు.

తల్లిదండ్రులిద్దరూ చదువుకున్న వాళ్లు అవ్వడంతో సమాజంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, స్ఫూర్తినిచ్చే కథలను చెబుతుండేవారు. మృగేంద్రకు కథల పుస్తకాలను చదవడం అలవాటు. అందులో గమనించిన ప్రతి చిన్న విషయాన్ని ఒక పుస్తకంలో రాసుకునేవాడు. ‘నేనూ అందరి పిల్లల్లా అల్లరి చేస్తాను. కానీ చదువులో ముందుంటాను. ఖాళీ దొరికినప్పుడల్లా సమయాన్ని రచనలు చేయడానికి ఉపయోగిస్తాను. నాలోని ఆసక్తిని గమనించిన అమ్మావాళ్లు నన్నెంతగానో ప్రోత్సహించారు. నా రచనలను ‘నేటి అభిమన్యు’ అనే కలం పేరుతో రాయడం మొదలెట్టాను. సమయం దొరికినప్పుడల్లా పెద్దల ద్వారా రామాయణం, మహాభారతంల గురించి క్షుణ్ణంగా తెలుసుకునేవాడిని. వాటిలోని 51 పాత్రల గురించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో రాయగలిగా. పాఠశాలలో ఉపాధ్యాయులు నాతో చాలా స్నేహంగా ఉంటారు’ అంటున్నాడు మృగేంద్ర. మృగేంద్ర ఇంకా ఎందరో మేధావుల జీవిత చరిత్రలను రాశాడు.

హిందీలో సుమంత్‌, పినాక్‌, రామ్‌, ప్రహస్త్‌ పేరుతో 25 నుంచి వంద పేజీల పుస్తకాలను రచించాడు. ఎక్కువ బయోగ్రఫీలు రాసిన బాలుడిగా ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించుకున్నాడు. తన మనస్సులోని భావాలకు రూపాన్నిస్తూ కొన్ని పద్యాలను రచించాడు. పద్యాలు రాయటం ఓ ప్రత్యేకమైన కళ. అలాంటిది 13 ఏళ్ల బాలుడు రాయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న వయస్సులోనే ఇన్ని అద్బుతాలు సాధించాడు కాబట్టేనేమో లండన్‌లోని ‘వరల్డ్‌ రికార్డ్‌ యూనివర్శిటీ’ క్యాంపస్‌లో డాక్టరేట్‌ చేయాలని ఆహ్వానం అందింది. భవిష్యత్తులో వివిధ అంశాలతో కూడిన పుస్తకాలను రాస్తానంటున్న మృగేంద్రకు క్రికెట్‌, పుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టం. ఆల్‌ ది బెస్ట్‌ మృగేంద్ర రాజ్‌!

Related posts