telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

13 ప్యాసింజర్‌ రైళ్ల రద్దు … దక్షిణమధ్య రైల్వే …

special train between vijayawada to gudur

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరానికి నడుపుతున్న 13 ప్యాసింజర్‌ రైళ్లను ఆరు నెలల పాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. వీటిలో సికింద్రాబాద్‌-మేడ్చల్‌-సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా-మేడ్చల్‌-ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌-సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా-ఉందానగర్‌-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-మనోహరాబాద్‌-సికింద్రాబాద్‌, బొల్లారం-ఫలక్‌నుమా-బొల్లారం తదితర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్‌ రైళ్లు.. ఫలక్‌నుమా-భువనగిరి-ఫలక్‌నుమా మెమూ ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. భద్రత, నిర్వహణ కారణాలతో వీటిని రద్దుచేస్తున్నట్లు పేర్కొంది.

నాలుగు ప్యాసింజర్‌ రైళ్లను ద.మ.రైల్వే.. డిసెంబరు 16 నుంచి మార్చి 15 వరకు మూడునెలల పాటు పాక్షికంగా రద్దుచేసింది. బోధన్‌-మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌-కాచిగూడ రైళ్లు షాద్‌నగర్‌-మహబూబ్‌నగర్‌ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు కానున్నాయి. కాచిగూడ-మేడ్చల్‌, మేడ్చల్‌-కాచిగూడ ప్యాసింజర్‌ రైళ్లు బొల్లారం-మేడ్చల్‌ స్టేషన్ల మధ్య రద్దు కానున్నాయి. హైదరాబాద్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. తక్కువ ఛార్జీలు ఉండే రైళ్లపైనే ఎక్కువమంది ఆధారపడతారు. వీరందరిపై ఈ ప్రభావం పడనుంది. ఆరునెలల పాటు రద్దు చేయడంతో.. తమ రాకపోకల పరిస్థితి ఏమిటన్న ఆందోళన ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. డబ్లింగ్‌ లైను పనుల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ మార్గంలో.. ఎంఎంటీఎస్‌ 2వ దశ పనులకోసం మనోహరాబాద్‌ మార్గంలో రైళ్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా మార్గాల్లో వచ్చే ఇతర రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు వంటి ప్రత్యామ్నాయాలు చేయడం ద్వారా ఇబ్బంది లేకుండా చేయవచ్చు. అలాంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Related posts