telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మహారాష్ట్రలో .. గతమూడేళ్లలో .. 12వేలమంది రైతుల ఆత్మహత్యలు…

12000 plus farmers died in maharastra

దేశానికే ఆకలి తీరుస్తున్న రైతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని గిట్టుబాటు ధరలు రాక.. చేసిన అప్పులు తీర్చలేక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మూడేళ్లలో మహారాష్ట్రలో 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2015-18 మధ్య కాలంలో 12 వేలకు పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడినట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో ఆ రాష్ట్ర మంత్రి సుభాష్ దేశ్‌ముఖ్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఈ మూడేళ్ల కాలంలో మొత్తం 12 వేల 21 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రకటించారు.

ఆత్మహత్య చేసుకున్న వారిలో 6,888 మంది ప్రభుత్వ పరిహారం పొందేందుకు అర్హులుగా గుర్తించారు. 90 శాతానికి పైగా అర్హులైన 6 వేల 845 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు సభాముఖంగా తెలిపారు మంత్రి. ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు 610 మంది రైతులు సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకుంటే.. అందులో 192 మందిని ప్రభుత్వ సాయానికి అర్హులుగా ప్రకటించారు. అందులో ఇప్పటికే 182 కుటుంబాలకు పరిహారం అందించినట్లు తెలిపారు. అదలావుంటే మిగిలిన రైతు ఆత్మహత్యల విషయంలో పూర్తి వివరాలు పరిశీలిస్తున్నామని.. వారి కుటుంబాలు ప్రభుత్వ సాయానికి అర్హులా కాదా అనే విషయం తేలాల్సి ఉందన్నారు.

Related posts