telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణకు .. భారీగా పెంచిన వైద్య సీట్ల కోట..

1050 more medical seats to telangana

2019-20 వైద్యవిద్య సంవత్సరానికి తెలంగాణలో ఎంబీబీఎస్‌ సీట్లు భారీగా పెరిగాయి. గతేడాది అందుబాటులో ఉన్న సీట్లతో పోల్చితే ఏకంగా 1050 సీట్లు పెరగడం విశేషం. ప్రభుత్వ వైద్యంలో నల్గొండ, సూర్యాపేట కళాశాలలకు కొత్తగా భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నుంచి అనుమతులు లభించగా.. ప్రైవేటులో పట్నం మహేందర్‌రెడ్డి వైద్య కళాశాల (చేవెళ్ల), మమత వైద్య కళాశాల(బాచుపల్లి), సురభి వైద్య కళాశాల(సిద్దిపేట)లకు కూడా 2019-20కి అనుమతులొచ్చాయి. ఒక్కో కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున మొత్తంగా 750 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడుగా గతేడాది అనుమతులు లభించని మల్లారెడ్డి మహిళా వైద్య కళాశాల (హైదరాబాద్‌)కు, మహావీర్‌ వైద్య కళాశాల (వికారాబాద్‌)కు కూడా ఈ ఏడాదికి ఒక్కో దాంట్లో 150 సీట్ల చొప్పున మొత్తంగా 300 సీట్ల పునరుద్ధరణకు అనుమతులు లభించాయి. ఈ మేరకు ఎంసీఐ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటులో మొత్తంగా 12 వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పడ్డాయి. ప్రభుత్వ రంగంలో నాలుగేళ్ల కిందట మహబూబ్‌నగర్‌ వైద్య కళాశాలను, రెండేళ్ల కిందట సిద్దిపేట వైద్య కళాశాలను ప్రారంభించగా 2019-20లో ఈ రెండింటికీ పునరుద్ధరణ అనుమతులు లభించాయి. 2016లోనే ఈఎస్‌ఐ వైద్య కళాశాలను రాష్ట్రంలో నెలకొల్పారు.

వీటికి అదనంగా ఈ ఏడాది నుంచి నల్గొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటులో అయాన్‌, మహేశ్వర, మహావీర్‌, ఆర్‌వీఎం, పట్నం మహేందర్‌రెడ్డి, మమత(బాచుపల్లి), సురభి వైద్యకళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1550 ఎంబీబీఎస్‌ సీట్లు, 22 ప్రైవేటు కళాశాలల్లో 3050 సీట్లు.. మొత్తంగా 4600 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని మొత్తం సీట్లు, ప్రైవేటులోని సగం సీట్లు కలుపుకొని సర్కారు ఆధ్వర్యంలోనే కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. అంటే 3075 ఎంబీబీఎస్‌ సీట్లు కన్వీనర్‌ కోటాలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నల్గొండ, సూర్యాపేట వైద్యకళాశాలలకు ఎంసీఐ నుంచి అనుమతులు లభించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందనీ.. సీఎం చొరవతోనే కొత్త కళాశాలలొచ్చాయనీ, ఇందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వ వైద్యంలో కొత్తగా 300 ఎంబీబీఎస్‌ రావడానికి కృషిచేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి అభినందించారు.

Related posts