telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మొన్నటిదాకా నేతల సీటు కష్టాలు .. నేడు ఓట్లకోసం ప్రజల కష్టాలు..!

Contest candidate expenditure MCMC
రేపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌ నుండి ఏపి వైపు ప్రజలు తరలి వెళ్తున్నారు. దీనితో లింగంపల్లి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగ రోజులను తలపించే విధంగా ప్రయాణాలు సాగుతున్నాయి. సికింద్రాబాద్‌ స్టేషన్లో సాయంత్రం బయలుదేరే ఫలక్‌నుమా, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. జనరల్‌ బోగీలతో సహా స్లీపర్‌ క్లాస్‌ బోగీల్లో కూడా సాధారణ ప్రయాణికులు ఎక్కేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 
కొన్ని ప్రైవేటు ట్రావెల్‌ సంస్థలురూ. 500 నుంచి రూ. 600 వరకూ ఉండే టికెట్‌ను రెట్టింపు చేశాయి. అలాగే విశాఖపట్నం వైపు వెళ్లే టికెట్లను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ అమ్ముకున్నాయి. ఇదే పరిస్థితి ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఉంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ రోజూ నడిపే 540 బస్సులకు అదనంగా 300 బస్సులను వేసింది. 10వ తేదీన కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం సుధాకర్‌ చెప్పారు. 500 బస్సులు అదనంగా నడుపుతున్నామని టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి ఆర్‌ఎం యాదగిరి తెలిపారు.

Related posts